అక్షరటుడే, కామారెడ్డి : Teenmar Mallanna Allegations | మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని రూ.కోట్లల్లో దోచేశాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. టీఆర్పీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
Teenmar Mallanna Allegations | బీడీ పింఛన్లలో భారీ దోపిడీ..
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో బీడీ కార్మికులకు (Beedi Workers) పింఛన్ల కోసం నిధులు కేటాయిస్తే అందులో భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 2017-18లో రూ.430 కోట్లు కేటాయిస్తే రూ.45.28 కోట్లు దోచుకున్నారని, 2019-20లో రూ.803 కోట్లు కేటాయిస్తే రూ.84.30 కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు సానిటరీ ప్యాడ్ కిట్ల కోసం రూ.44 కోట్లు కేటాయిస్తే రూ.40.20 కోట్లు పంచుకున్నారని, 2018-19 లో రూ.75 కోట్లు కేటాయిస్తే రూ.41.51 కోట్లు మాయం చేశారని ఆరోపించారు.
Teenmar Mallanna Allegations | విద్యార్థినులకు సౌకర్యాల విషయంలోనూ..
పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక బాత్రూంలు నిర్మించడం కోసం కేటాయించిన నిధులలో రూ.71 కోట్లను సైతం పక్కదారి పట్టించారని మల్లన్న విమర్శించారు. వికలాంగులకు సంబంధించిన నిధుల్లో రూ.1.25 కోట్లు మెక్కారని.. కల్యాణలక్ష్మి పథకంలో (Kalyana Lakshmi scheme) రూ.2 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మైనారిటీలకు కేటాయించిన నిధులలో సైతం దోపిడీ జరిగిందన్నారు. 2014-15లో మైనార్టీలకు రూ.1,050 కేటాయిస్తే.. అందులో రూ.726.15 కోట్లు దోచుకున్నారని, 2015-16లో రూ.556 కోట్లు, 2017-18లో రూ.370 కోట్లు ఇలా మొత్తం రూ. 2వేల కోట్లు దోచుకున్నారని వ్యాఖ్యానించారు.
Teenmar Mallanna Allegations | కామారెడ్డిలో ఏ చౌరస్తాలోనైనా చర్చకు సిద్ధమే..
ఈ లెక్కలన్నింటితో కామారెడ్డిలో (Kamareddy) ఏ చౌరస్తాలో అయినా చర్చకు సిద్ధమని తీర్మార్ మల్లన్న సవాల్ విసిరారు. ఇవి తప్పని నిరూపిస్తే కామారెడ్డి చౌరస్తాలో ఉరేసుకుంటామని, ఆయా పార్టీల నాయకులకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేల్లో 2వేల గాడిదలు, 1.38 లక్షల పందులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో లెక్కలు చెప్పారని.. కానీ కులగణనలో జనాభా లెక్క చెప్పాలని అడిగితే తాము చెప్పమని అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద పందులు, గాడిదల లెక్క ఉందని, మనుషుల లెక్క లేదని విమర్శించారు.
Teenmar Mallanna Allegations | బీసీ డిక్టరేషన్ చేసి.. గాలికొదిలేశారు..
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ (BC Declaration) చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మల్లన్న అన్నారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేసి రూ.9వేల కోట్లు చోరీ చేశారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డే అసలైన దొంగ అని విమర్శించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు రూ.12,500లకు మార్కెట్లో మంచం లభిస్తే ప్రభుత్వం మాత్రం రూ.33వేలు పెట్టి కొన్నారని ఆరోపించారు. పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 2014-15లో రూ.1,054 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రూ.697.40 కోట్లు మాయం చేశారన్నారు. 2015-16లో రూ.529 కోట్లు, 2017-18 లో రూ.1,470 కోట్లు, 2018-19లో రూ.1,790 కోట్లు తిన్నారని ఆరోపించారు. ఈ సొమ్మంతా మూకుమ్మడిగా పంచుకున్నారని, పేదలకు మాత్రం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఈ లెక్కలపై నిలదీయాలని కోరారు.
Teenmar Mallanna Allegations | నా పిల్లలపై ఒట్టు..
తన పిల్లల మీద ఒట్టు వేసి చెబుతున్నానని, పేదల పిల్లల భవిష్యత్తు మార్చేందుకే తాను వచ్చానని మల్లన్న పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎన్ని ఇచ్చినా తీసుకోవాలని, కత్తెర గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు హరిశంకర్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆకుల హన్మాండ్లు, జిల్లా అధ్యక్షుడు తాహెర్ మహ్మద్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.