Homeటెక్నాలజీIT Sector | ఐటీలో అనిశ్చితి.. వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేస్తున్న టెకీలు

IT Sector | ఐటీలో అనిశ్చితి.. వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేస్తున్న టెకీలు

IT Sector | రాను రాను సాఫ్ట్ వేర్ రంగం కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు జాబు ఊడుతుందో అన్న భ‌యంతో వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఈ క్ర‌మంలో చాలామంది వ్య‌వ‌సాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IT Sector | ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు, అధిక వేతనాలకు పర్యాయంగా నిలిచిన సాఫ్ట్‌వేర్ రంగం (software sector), ఇప్పుడు అనిశ్చితి మబ్బుల్లో చిక్కుకుపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి టాప్ కంపెనీలు సైతం పదేళ్లు, పదిహేనేళ్లు పనిచేసిన అనుభవజ్ఞులకే నోటీసులు అందించ‌డం ఉద్యోగ భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఉద్యోగాల తొలగింపుల ఫలితంగా మిగిలిన ఉద్యోగులపై (Employees) పని భారం విపరీతంగా పెరిగింది. “నెక్స్ట్ నేనే ?” అన్న భయం, ఆందోళన రోజు రోజుకీ పెరుగుతూ.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన మధుమేహం, హై బీపీ, డిప్రెషన్ మొదలైనవ‌ యువ ఉద్యోగుల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ‘లైఫ్ సెటిల్’ అనే భావనకు పర్యాయంగా భావించిన ఐటీ ఉద్యోగం.. ఇప్పుడు జీవితాన్నే ప్రమాదంలో పెట్టే స్థితికి చేరుకుంది.

IT Sector | వ్యవసాయంలో ప్రత్యామ్నాయం

ఈ నేపథ్యంలో, అనేక మంది ఐటీ వృత్తిదారులు మానసిక ప్రశాంతత కోసం వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది పార్ట్‌టైమ్ రైతులుగా మారుతుండ‌గా, మరికొంతమంది పూర్తిస్థాయిలో టెక్ కెరీర్‌ను వదిలి ఫుల్ టైమ్ అగ్రికల్చర్‌ వైపు మళ్లుతున్నారు. “మహర్షి సినిమాలో హీరో చూపించిన విధంగా వారం చివరలో కాదు.. వారమంతా వ్యవసాయమే జీవితం అని నిర్ణయించుకుంటున్నారు.

వ్యవసాయాన్ని పాత పద్ధతుల్లో కాకుండా, టెక్నాలజీని (Technology) మిళితం చేసి ఆన్‌లైన్ మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్లు, డైరెక్ట్ కన్స్యూమర్ సేల్స్ వంటివి చేస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తుల భారం లేకుండా, లాభాలను నేరుగా పొందుతున్నారు. పూలు, పండ్లు, పాడి, కోళ్ల పెంపకం వంటి విభిన్న విభాగాల్లోకి ప్రవేశిస్తూ తమ పొదుపు డబ్బులతో భూములు కొనుగోలు చేయడం, లేదా లీజ్ తీసుకొని సాగు చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగాల్లో (IT Jobs) ఉండే ఒత్తిడిని వదిలి.. ప్రకృతిలో మమేకమవుతూ జీవించాలనే ఆస‌క్తి ఈ మార్పుకు దారితీస్తున్నాయి. వ్యవసాయంలో ఉండే శారీరక శ్రమ, స్వచ్ఛమైన వాతావరణం.. మానసిక ప్రశాంతతను ఇస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక మార్గమే కాదు, ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను మెరుగుపరిచే మార్గంగా నిలుస్తోంది. ఐటీ రంగంలో మారుతున్న ధోరణులు, ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న అనిశ్చితి మధ్య, ఈ మార్పు అనివార్యమైంది. ‘మట్టే మేలు’ అనే జ్ఞానం మళ్లీ నేటి యువతలో వెల్లివిరుస్తోంది. ఐటీ టెకీలు ఇప్పుడు మట్టితో మేళవించి, సరికొత్త ‘గ్రీన్ రివల్యూషన్’కు నాంది పలికేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.