HomeజాతీయంCab Drivers | క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న టెకీలు.. ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొత్త మార్గం

Cab Drivers | క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న టెకీలు.. ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొత్త మార్గం

బెంగళూరు టెకీల కొత్త జీవనశైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ బై డే, క్యాబ్ డ్రైవర్‌ బై నైట్!” అంటూ చాలామంది ఈ ట్రెండ్‌ను ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cab Drivers | ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. “ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడే క్యాబ్ డ్రైవర్‌ను కలిస్తే.. అతను పక్కా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయి ఉండొచ్చు” అని స్థానికులు సరదాగా అంటున్నారు. అయితే ఇది కేవలం జోక్ కాదు, వాస్తవానికి చాలా మంది టెకీలు నిజంగానే పార్ట్ టైమ్‌గా క్యాబ్ డ్రైవర్లుగా (Cab Drivers) పనిచేస్తున్నారు. దీనికి కారణం డబ్బుల కొరత కాదు. “ఒంటరితనం” అని చెబుతున్నారు ఆ టెకీలు.

Cab Drivers | ఆఫీస్ తర్వాత స్టీరింగ్ పట్టే ఇంజినీర్లు

బెంగళూరులోని (Bangalore) అనేక ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్ అవర్స్‌ పూర్తయ్యాక క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని కోడ్ రాయడం, డెడ్‌లైన్‌ల ఒత్తిడి, నిరంతర మీటింగ్‌లు, ఒంటరి జీవితం ఇవన్నీ వారిని మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు, వేరే మనుషులతో మాట్లాడేందుకు, బిజీగా ఉండేందుకు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారట. ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పనిచేస్తున్న వ్య‌క్తి మాట్లాడుతూ.. రోజంతా కోడ్‌లు, క్లయింట్ కాల్స్, ప్రెజెంటేషన్లు ..ఇదే లైఫ్ అయిపోయింది. ఇంటికి వెళ్లినా ఎవరూ ఉండరు. వారాంతాల్లో కూడా ఒంటరితనమే.

అందుకే రాత్రి పూటల్లో రెండు, మూడు గంటలు క్యాబ్ డ్రైవ్ చేస్తాను. మనుషులతో మాట్లాడతాను. మైండ్ ఫ్రెష్ అవుతుంది. డబ్బు కోసం కాదు, రిలీఫ్ కోసం చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఒకే విధమైన జీవితం ఉంటుంది. ఉదయం ఆఫీస్‌కి వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి రావడం. ఈ రొటీన్‌ లైఫ్ మానసిక అలసటను కలిగిస్తుంది. ఈ అలసటను తగ్గించుకునేందుకు కొందరు సంగీతం, జిమ్, ట్రెక్కింగ్‌ వంటివి చేస్తే, మరికొందరు డ్రైవింగ్‌నే ఒక థెరపీగా భావిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, కొత్త మనుషులను కలవడం వల్ల కొత్త అనుభవాలు వస్తాయని వారు చెబుతున్నారు. బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్‌పోర్ట్ (Kempegowda Airport), వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, సరజాపూర్‌ వంటి ప్రాంతాల్లో ఇలాంటి పార్ట్‌టైమ్ క్యాబ్ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే డ్రైవింగ్ చేస్తారు. ఎక్కువ దూరం ఉన్న రైడ్స్‌ను మాత్రమే ఎంచుకుంటారు. కొందరు స్వయంగా తమ కార్లను ఉపయోగిస్తుండగా, మరికొందరు ఓలా, ఉబెర్‌ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో రిజిస్టర్‌ అయి పని చేస్తున్నారు.