అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Artificial Intelligence | 2025 సంవత్సరం టెక్ రంగం ఉద్యోగులకు కోలుకోలేని షాకులు ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 218 కంపెనీలు కలిపి 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయని అంతర్జాతీయ లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi తాజా డేటా వెల్లడించింది.
వృద్ధి మందగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత ఆటోమేషన్ వైపు వేగంగా మళ్లడం వంటి అంశాలు ఈ భారీ ఉద్యోగాల కోతకు దారితీశాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన చరిత్రలోనే అత్యధికంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆపరేషన్స్, హెచ్‌ఆర్, ఏడబ్ల్యూఎస్, డివైజెస్ విభాగాల్లో పనిచేస్తున్న 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. “కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా నడపాలనుకుంటున్నాం. ఏఐ ఆధారిత సేవలపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం,” అని సీఈవో ఆండీ జాస్సీ (CEO Andy Jassy) వెల్లడించారు.
Artificial Intelligence | ఇంటెల్, టీసీఎస్ సైతం భారీగా ఉద్యోగ కోతలు
ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ (Intel) కూడా భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గిస్తోంది. పీసీ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో, కంపెనీ మొత్తం సిబ్బందిలో 22 శాతం అంటే సుమారు 24,000 మందిని తొలగించనుంది. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కూడా తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతను నమోదు చేసింది. 2025 సెప్టెంబర్ త్రైమాసికంలో 19,755 మందిని తొలగించింది. దీంతో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6 లక్షల కంటే దిగువకు పడిపోయింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్ పెరగడంతో మధ్య మరియు ఉన్నత స్థాయి ఉద్యోగాలపై ప్రభావం పడిందని కంపెనీ సీహెచ్‌ఆర్‌వో సుదీప్ కున్నుమల్ తెలిపారు.
ఏఐ, క్లౌడ్ సేవల వైపు మళ్లిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ 9,000, సేల్స్‌ఫోర్స్ 4,000, యాక్సెంచర్, సిస్కో, గూగుల్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలను తగ్గించాయి. ఈ ట్రెండ్ కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఆటోమేషన్ కారణంగా యూపీఎస్ 48,000 మంది, ఫోర్డ్ 13,000 మంది, పారామౌంట్ గ్లోబల్ 2,000 మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీలు ఒకవైపు ఏఐ టూల్స్‌పై (AI tools) బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరోవైపు ఉద్యోగాలను తగ్గించుకోవడం టెక్ రంగానికి కొత్త సవాలుగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే సంవత్సరాల్లో ఏఐ ఆధారిత ఆటోమేషన్ మరింత వేగం పెంచే అవకాశం ఉందని అంచనా.
