అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SA | టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడంటే పరుగుల వరద పారించే ‘స్కై’, కెప్టెన్ అయిన తర్వాత మాత్రం స్కోర్లు చేయడంలో తడబడుతున్నాడు.
దీంతో అతని ఫామ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ధర్మశాల టీ20 మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో (South Africa) జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడోసారి సూర్య విఫలమయ్యాడు. ఈజీ టార్గెట్ ఉన్నప్పటికీ పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. షాట్ సెలక్షన్లో తప్పిదాలు, ముఖ్యంగా అతనికి ఇష్టమైన పికప్ షాట్ వల్లే పలుమార్లు వికెట్ కోల్పోతుండటం గమనార్హం.
IND vs SA | రాణించిన టీమిండియా..
ధర్మశాల (Dharmashala) మ్యాచ్‌లో కూడా అదే షాట్ అతని పతనానికి కారణమైంది. ఆ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి అవుటయ్యాడు. 2025 ఏడాదిలో ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది అతని బ్యాటింగ్ యావరేజ్ 15 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఆడిన 20 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్‌ను దాటగలిగాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన 47 నాటౌట్ ఈ ఏడాది అతని అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ గణాంకాలు చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో సూర్య ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే ఐపీఎల్ 2025లో (IPL 2025) మాత్రం సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా భిన్నమైన ఫామ్ చూపించాడు. ముంబై ఇండియన్స్ తరఫున 717 పరుగులు చేసి లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ అదే ఫామ్‌ను అంతర్జాతీయ స్థాయిలో కొనసాగించలేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తన ఆటపై నమ్మకం వ్యక్తం చేశాడు.నిజం చెప్పాలంటే నేను నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా చేతిలో ఉన్న ప్రతిదీ ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్‌లో రన్స్ రావాల్సిన సమయం వస్తే అవి తప్పకుండా వస్తాయి. ఫామ్‌లో లేను అనడం సరైంది కాదు. కేవలం రన్స్ రావడం లేదు అంతే” అని స్పష్టం చేశాడు. అయితే టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.
ధర్మశాలలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా జట్టులో ఎయిడెన్ మార్కరమ్ 46 బంతుల్లో 61 పరుగులు చేసి స్కోరు వంద పరుగులు దాటేలా చేశాడు . అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను (South Africa) 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ చేశారు.ఈ లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో గిల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక డిసెంబర్ 17న లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌ను ఖాయం చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.