Homeక్రీడలుWomens World Cup | తెరవెనుక వీరుడు అమోల్ ముజుందార్.. ఆయన శిక్షణలోనే మహిళల తొలి...

Womens World Cup | తెరవెనుక వీరుడు అమోల్ ముజుందార్.. ఆయన శిక్షణలోనే మహిళల తొలి ప్రపంచ కప్ విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఘన విజయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఈ విజయానికి తెరవెనుక నాయ‌కుడైన కోచ్ అమోల్ ముజుందార్ పేరు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Womens World Cup | భారత మహిళల జట్టు ఇటీవల ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ గెలుపు వెనుక కష్టపడిన హీరోల్లో ఒకరు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆయన మార్గదర్శకత్వంలో మహిళల జట్టు ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీని అందుకుంది.

ఈ క్ర‌మంలో ఆయ‌న గురించి నెటిజ‌న్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. 1974 నవంబర్ 11న ముంబైలో జన్మించిన అమోల్ ముజుందార్ (Amol Muzumdar) చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువతో ఎదిగాడు. కేవలం 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేసి, తొలి ఇన్నింగ్స్‌లోనే అజేయంగా 260 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు దాదాపు రెండు దశాబ్దాలపాటు ఎవరికీ అందలేదు.

Womens World Cup | రియ‌ల్ గేమ్ ఛేంజ‌ర్..

ముజుందార్ ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 171 మ్యాచ్‌లు ఆడి, 48.13 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఆయన పేరిట 30 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆయన నాయకత్వంలో ముంబై 37వ రంజీ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ప్రతిభ ఉన్నప్పటికీ, ఆ కాలంలో టీమిండియా (Team India)లో సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉండటంతో ముజుందార్‌కు జాతీయ జట్టులో అవకాశం రాలేదు. అయినప్పటికీ ఆయనను చాలామంది “తదుపరి సచిన్” అని పిలిచేవారు. 2014లో ముజుందార్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అండర్-19, అండర్-23 జట్లకు కోచ్‌గా పని చేసి, తరువాత రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటింగ్ కోచ్‌గా మూడు సంవత్సరాలు సేవలందించాడు.

అతని కోచింగ్ నైపుణ్యాన్ని గుర్తించిన BCCI, 2023 అక్టోబర్‌లో ముజుందార్‌ను భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. ఆయన శిక్షణలో జట్టు క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ఆడి, 2025లో తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీ (World Cup Trophy)ని గెలుచుకుంది. తెరవెనుక ఉన్నా, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అమోల్ ముజుందార్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. క్రికెట్ అభిమానులు ఆయనను “మహిళల విజయానికి నిజమైన గేమ్‌చేంజర్”గా కొనియాడుతున్నారు.