అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | సొంతగడ్డపై సౌతాఫ్రికా (South Africa) చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేయడం, ఆ తర్వాత వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్ గెలవడం ద్వారా మూడో స్థానానికి చేరిన టీమిండియా, తాజా పరిణామాలతో ఆరో స్థానానికి పడిపోయింది.
మొన్నటి వరకూ పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్న న్యూజిలాండ్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. వెస్టిండీస్ (West Indies)తో తొలి టెస్టును డ్రా చేసుకున్న కివీస్, రెండో టెస్టులో ఘన విజయం సాధించడంతో పాయింట్స్ టేబుల్లో భారీగా లాభపడింది. ఫలితంగా న్యూజిలాండ్ (New Zealand) నేరుగా మూడో ర్యాంక్‌కు చేరగా, టీమిండియాకు ఇది పెద్ద షాక్‌గా మారింది.
Team India | మనోళ్లు ఏం చేస్తారో మరి..!
డబ్ల్యూటీసీ (WTC )లో వరుసగా రెండు సార్లు ఫైనల్ ఆడిన భారత్, గత సైకిల్లో మాత్రం ఫైనల్‌కు చేరలేకపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురవడం, ఆపై ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి కారణంగా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ అవకాశాలు చేజారాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 2025-2027 డబ్ల్యూటీసీ సైకిల్లోనూ భారత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. సౌతాఫ్రికా చేతిలో సొంతగడ్డపై క్లీన్ స్వీప్‌కు గురవ్వడంతో భారత్ మూడో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. తాజాగా న్యూజిలాండ్ విజయం మరో స్థానం కిందకు నెట్టింది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా (Australia) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అన్నింటిలోనూ గెలిచి 100 శాతం విజయశాతంతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత సౌతాఫ్రికా (75%), న్యూజిలాండ్ (66.670%), శ్రీలంక (66.670%), పాకిస్థాన్ (50%) జట్లు భారత్ కంటే ముందున్నాయి. ఇంగ్లాండ్ (30.950%), బంగ్లాదేశ్ (16.670%), వెస్టిండీస్ (4.760%) వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను తొలిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా, మూడోసారి సౌతాఫ్రికా గెలుచుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఇకపై ప్రతి సిరీస్ కీలకంగా మారనుంది.