అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs NZ | జనవరి 25, ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం (Barsapara Cricket Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ను మరోసారి మట్టికరిపించిన టీమిండియా, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను ఖాయం చేయడం భారత జట్టు ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.ఈ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానాల్లో జస్పీత్ బుమ్రా, రవి బిష్ణోయ్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, అది పూర్తిగా ఫలించింది.
IND vs NZ | రికార్డుల మోత..
భారత బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ జట్టు 153 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలింగ్‌లో జస్పీత్ బుమ్రా చెలరేగి 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో సంజు శాంసన్ ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటింగ్ తుఫాన్ న్యూజిలాండ్‌ను పూర్తిగా కుదిపేసింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 14 బంతుల్లోనే అర్ధసెంచరీ బాది స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ఇది టీ20ల్లో భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇషాన్ కిషన్ 28 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఫలితంగా భారత్ 8 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా (Team India) వరుసగా 10వ టీ20 సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 9 సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో (పూర్తి సభ్య దేశాల మధ్య) మూడో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా అభిషేక్ ఖాతాలో చేరింది. పవర్‌ప్లేలో భారత్ 94/2 పరుగులు చేయడం విశేషం. ఇది టీమిండియాకు రెండో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌గా నమోదైంది (అత్యధికం 95/1 – 2025లో ఇంగ్లాండ్‌పై). అంతేకాదు, 150కిపైగా లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి భారత్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. మరోవైపు, కుల్దీప్ యాదవ్ గత 11 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా అతను 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వికెట్ లేకుండా ముగించాడు.