అక్షరటుడే, వెబ్‌డెస్క్: Test Series | ఆసియా కప్ దక్కించుకున్న టీమిండియా నేటి నుంచి వెస్టిండీస్‌తో (West Indies) టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఆసియా కప్‌లో భారత ఆటగాళ్ల జెర్సీలపై ఎలాంటి స్పాన్సర్ లోగో కనిపించలేదు. కాని తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జెర్సీలపై అపోలో టైర్స్ లోగో కనిపించింది. అత్యధికంగా రూ.579 కోట్ల బిడ్‌తో ‘అపోలో టైర్స్’ భారత క్రికెట్ జట్టు అధికారిక జెర్సీ స్పాన్సర్‌గా ఎంపికైంది. ఈ ఒప్పందం 2028 మార్చి వరకు అమల్లో ఉండనుంది. దీంతో భారత పురుషుల, మహిళల జట్లు మూడు సంవత్సరాల పాటు అపోలో టైర్స్ బ్రాండ్‌తో కూడిన జెర్సీలలో బరిలోకి దిగనున్నాయి.
Test Series | కొత్త స్పాన్సర్‌తో..
ఇప్పటి వరకు జెర్సీ స్పాన్సర్‌గా (Sponsor) ఉన్న డ్రీమ్ 11 సంస్థ, ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టడంతో ఒప్పందాన్ని విరమించుకుంది. దీంతో ఆసియాకప్ వంటి ప్రధాన టోర్నమెంటుల్లోనూ టీమిండియా జెర్సీపై స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో, హర్యానా కేంద్రంగా పనిచేస్తున్న అపోలో టైర్స్, ఇతర పోటీదారులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. కాన్వా రూ.544 కోట్లు, జేకే సిమెంట్స్ రూ.477 కోట్లు బిడ్ వేసినప్పటికీ, అపోలో టైర్స్ అత్యధిక బిడ్‌దాఖలు చేసి స్పాన్సర్‌షిప్ హక్కులు దక్కించుకుంది. ఈ ఒప్పందం కింద అపోలో టైర్స్, ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ.4.77 కోట్లు, ఐసీసీ టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు రూ.2.4 కోట్లు చెల్లించనుంది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో డ్రీమ్ 11 మ్యాచ్‌కు సగటున రూ.4 కోట్లు చెల్లించేది.
Test Series | కీలక టోర్నమెంట్లకు..
ఈ ఒప్పందంలో భాగంగా అపోలో టైర్స్ (Appolo Tyres) టీమిండియా ఆడే పలు ప్రధాన అంతర్జాతీయ టోర్నీల్లో భాగస్వామిగా ఉండనుంది. ఇందులో టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే వరల్డ్ కప్ 2027, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 వంటి మెగా ఈవెంట్లు ఉన్నాయి. మొత్తం మీద 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఈ ఒప్పంద పరిధిలో ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభమైన టెస్టు సిరీస్ ద్వారా అపోలో టైర్స్ స్పాన్సర్‌షిప్ ప్రారంభం కాగా, మూడేళ్ల పాటు భారత ఆటగాళ్ల జెర్సీలపై ఈ బ్రాండ్ లోగో కనిపించనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన విండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. సిరాజ్ 3 వికెట్లు తీయగా, బుమ్రా ఒక వికెట్ తీశాడు.