అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | భారత్-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఏ మాత్రం పోరాటం చూపించలేకపోయిన టీమిండియా (Team India) రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఘోరంగా విఫలమైంది. దాంతో 140 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 25 ఏళ్ల తర్వాత భారత్‌లో సిరీస్ సాధించింది సఫారి జట్టు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది సౌతాఫ్రికా జట్టు. భారత్–దక్షిణాఫ్రికా (India–South Africa) మధ్య గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఒత్తిడిలో పడి వెంట వెంటనే వికెట్స్ కోల్పోయింది.. డ్రా లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తొలి సెషన్లోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. నాలుగో రోజు ఓపెనర్లు అవుట్ కాగా, ఐదో రోజు ఉదయం ఆట మొదలైన కొద్దిసేపటికే నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత ఇన్నింగ్స్ అస్తవ్యస్తమైంది.సైమన్ హార్మర్ స్పిన్‌కు భారత బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో స్కోరు బోర్డు కదలలేని పరిస్థితి నెలకొంది. కుల్దీప్ను అద్భుత బంతితో బౌల్డ్ చేసిన హార్మర్, అదే ఓవర్లో ధ్రువ్ జురేల్‌ను కూడా అవుట్ చేశాడు.
IND vs SA | జడేజా ఒంటరి పోరాటం
ఆ తరువాత దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రిషభ్ పంత్ (Rishabh Pant) హార్మర్ బౌలింగ్‌కు బలై 13 పరుగులతో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లతో బయటపడ్డ సాయి సుదర్శన్ టీ బ్రేక్ తర్వాత హర్మర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టీ బ్రేక్ తర్వాత సఫారీల స్పెషలిస్ట్ స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామీ ఆటలోకి వచ్చి తొలి ఓవర్లోనే సాయి సుదర్శన్ (Sai Sudarshan)ను ఔట్ చేయడంతో భారత్ 95 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 139 బంతులు ఆడిన సుదర్శన్ 14 పరుగులకే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ..హర్మర్ అద్భుతమైన బంతికి వెనుదిరిగాడు. స్పిన్ మాయాజాలంతో దక్షిణాఫ్రికా భారత్‌ను వణికించింది. భారత ఆల్ రౌండర్ జడేజా మినహా మిగతా వారు విఫలం అయ్యారు. జడేజా 54 పరుగులు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి (0), సిరాజ్ (0) వెంట వెంటనే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్స్‌లో హార్మర్ 6 వికెట్లు తీయగా,మహరాజ్ 2, జాన్సన్, ముత్తుస్వామి, చెరో వికెట్ తీశారు.