అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | వన్డే వరల్డ్ కప్ గెలుపుతో మంచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక జట్టుతో టీ 20 ఆడుతుంది. భారత్ – శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.
విశాఖపట్నం (Visakhapatnam)లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఏకపక్ష విజయాన్ని సాధించి సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యువ ఓపెనర్ షఫాలి వర్మ (Shafali Verma) బ్యాట్‌తో చేసిన విధ్వంసమే ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.
Team India | తడబడిన శ్రీలంక బ్యాటింగ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక (Srilanka) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. హర్షిత సమరవిక్రమ (33), కెప్టెన్ చమరి ఆటపట్టు (31) కొంత పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడిని తట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/31), శ్రీ చరణి (2/23) చెరో రెండు వికెట్లు పడగొట్టగా, స్నేహ్ రాణా (1/11), క్రాంతి గౌడ్ (1/21) పొదుపుగా బౌలింగ్ చేస్తూ లంక పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు.ఇక 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలి వర్మ మెరుపు ఆరంభాన్ని అందించింది. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన షఫాలి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేసింది.
స్మృతి మంధాన (Smriti Mandhana) (14) త్వరగా వెనుదిరిగినా, షఫాలి, జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) (26) కలిసి స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించారు. ఫలితంగా భారత్ కేవలం 11 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలి 34 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో నిలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. వరుసగా రెండు విజయాలతో టీమ్ ఇండియా మంచి ఊపులో ఉంది. సిరీస్‌లో మూడో టీ20 డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది. అక్కడ కూడా భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది.