అక్షరటుడే, వెబ్‌డెస్క్: Womens World Cup | వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్న భారత మహిళా జట్టు, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజా విసిరింది.
సెమీస్ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌ని ఓడించాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. నవీ ముంబై వేదికగా జరిగిన ఈ కీలక పోరులో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ (India) సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
Womens World Cup | స్మృతి–ప్రతీకల సెంచరీలతో విజృంభణ
టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కానీ ఆ నిర్ణయమే కివీస్‌కి తలనొప్పిగా మారింది. స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రతీక రావల్ జంట అద్భుతంగా ఆడి రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.స్మృతి తన స్టైల్‌లో ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగి 88 బంతుల్లో శతకం సాధించింది. ఆమెతో పాటు ప్రతీక రావల్ (Pratika Rawal) కూడా 122 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టింది. చివరి ఓవర్లలో జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును మరింత బలపరిచింది. హర్మన్‌ప్రీత్ మళ్లీ విఫలమైనా, ఇతరుల అద్భుత ఆటతో భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు (New Zealand) ప్రారంభం నుంచే ఒత్తిడికి లోనైంది. వర్షం కారణంగా మ్యాచ్ డక్‌వర్త్–లూయిస్ పద్ధతిలో తగ్గించడంతో కివీస్‌కు 44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యం నిర్ణయించారు. బ్రూక్ హాలిడే (81), ఇసబెల్లా గేజ్ (65 నాటౌట్), అమేలియా కెర్ (45) పోరాడినప్పటికీ భారత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు కివీస్ తేలిపోయింది. చివరికి 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో భారత్ తలపడనుంది. స్మృతి, ప్రతీక సెంచరీలు, జెమీమా ఫినిషింగ్ టచ్ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. భారత్ ఈ గెలుపుతో మరోసారి తాను ఎందుకు ప్రపంచస్థాయి జట్టో నిరూపించింది. సెమీస్‌లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై అభిమానులు దృష్టి సారించారు.

