అక్షరటుడే, వెబ్డెస్క్ :T20 World Cup Celebrations | జూన్ 29 భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండే రోజు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. దీంతో 17 ఏళ్ల దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలకగా, ఈ విజయం కోటిమంది భారత క్రికెట్ అభిమానుల కలలకు సాక్షిగా నిలిచింది. ఈ చారిత్రక విజయానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఇది ఆయన కెప్టెన్సీలో తొలి ఐసీసీ ట్రోఫీ(First ICC Trophy) కావడం విశేషం. అంతేకాదు, భారత్ 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని మళ్లీ ముద్దాడింది. ఈ విజయం తనకు ఎంతో ప్రత్యేకమైనదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. తాను ఆ సమయంలో జట్టుకి కెప్టెన్‌గా ఉన్నానని గుర్తు చేశాడు. ఈ విజయంతో దేశం సంతోషంతో ఉప్పొంగింది. రాసి పెట్టి ఉంది, అందుకే ఈ విజయం అని అన్నాడు.
T20 World Cup Celebrations | గెలుపు జ్ఞాపకాలు..
అయితే 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ స్వదేశంలోనే ఓటమి చవిచూసింది. దానిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే జూన్ 29, 2024న రోహిత్ సారథ్యంలోని జట్టు ఆ బాధను విజయంగా మలచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు కేవలం ట్రోఫీకి పరిమితం కాదు, టీమిండియా పట్టుదల, ఐక్యత, మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా నిలిచింది.. అయితే భారత జట్టు గతేడాది సాధించిన చారిత్రక టీ20 ప్రపంచకప్ గెలుపు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బర్మింగ్‌హామ్(Birmingham)లో స్పెషల్ సెలబ్రేషన్లు జరుపుకున్నారు ఆటగాళ్లు.
టీమిండియా ఆటగాళ్లు అందరు ఒకే చోట కలిసి గెలుపు తాలూకు మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఈ వేడుకలో కేక్ కట్ చేసి సంబరాలు జరపగా, అందుకు సంబంధించిన విశేషాల్ని బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. గతేడాది జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ(World Cup Trophy)ని సొంతం చేసుకుంది. కోట్లాది మంది భారతీయుల కలలు నిజం చేసిన ఆ గెలుపు, జట్టుకు మరొక మైలురాయిగా నిలిచింది. బీసీసీఐ షేర్ చేసిన సెలబ్రేషన్(Celebrations) వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆటగాళ్లు కూడా తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఆనాటి క్షణాలను పంచుకుంటూ, సెలబ్రేషన్లలో భాగమవుతున్నారు.