అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో వినూత్నంగా ప్రచారం చేపట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సర్కారు బడులపై అవగాహన కల్పిస్తున్నారు.
మహమ్మద్ నగర్ (Mohammad Nagar) మండలంలోని బూర్గుల్ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం చేపట్టారు. తమ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తూ విద్యాబోధన కొనసాగిస్తున్నామని వివరిస్తున్నారు. “మీ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించవద్దని ఇంటింటికి తిరుగుతూ” ఓపికగా వివరాలు అందజేస్తున్నారు. గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో తమ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తూ పోస్ట్లు పెడుతున్నారు.
Nizamsagar | సుశిక్షితులైన ఉపాధ్యాయులు
ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంతో పాటు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఇస్తోందని చెబుతున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ, ప్రతినెలా విషయాల వారీగా సామర్థ్యాల పరీక్ష నిర్వహిస్తామని తల్లిదండ్రులకు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కారు బడిపై ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారాన్ని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.