అక్షరటుడే, కామారెడ్డి: Education Department | విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఫోర్జరీ సంతకాలతో (signature forgery) హాజరు వేసుకుని జీతభత్యాలు పొందుతున్న టీచర్ను తొలగించాలని విద్యార్థి సంఘాలు (Student unions) డిమాండ్ చేశాయి.
ఈ మేరకు కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) విద్యాశాఖ కార్యాలయంలో సంఘాల ప్రతినిధులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాజంపేట మండలంలో ఆరెపల్లి తండా ప్రైమరీ పాఠశాలలో (Arepalli Thanda Primary School) ఓ ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో డీఈవో 2024 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారని వివరించారు. సుమారు రెండునెలల తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని.. దీనిని అదనుగా చేసుకొని ఆ ఉపాధ్యాయుడు తప్పుడు హాజరు పత్రాలను సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేయగా విద్యాశాఖ అధికారులు గుర్తించి 2025 ఆగస్టు 12న మళ్లీ సస్పెండ్ చేశారన్నారు.
మళ్లీ నెలన్నర రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు బాలాజీ పలుమార్లు సస్పెన్షన్లకు గురైనప్పటికీ.. మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు సహకరించిన సహ ఉపాధ్యాయులను, ఎంఈవోలు, డీఈవో కార్యాలయంలో సిబ్బందిపై కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సర్వీస్ నుండి తొలిగించాలని కోరారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

