అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన కామాక్షి (38) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా (government teacher) పనిచేస్తోంది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమె ప్లేట్లెట్ కౌంట్ తగ్గడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో (private hospital) చేరింది. అయితే బుధవారం వరకు ఆరోగ్యరీత్యా కోలుకుంటున్న కామాక్షి గురువారం ఆకస్మికంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోలుకుంటున్న మహిళ ఒక్కరోజులోనే ఎలా మృతి చెందుతుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. కామాక్షికి భర్తతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. అయితే వైద్యం చేయలేక తమ కుటుంబానికి ఆస్పత్రి యాజమాన్యం అన్యాయం చేసిందని కుటుంబ సభ్యులు వాపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.