అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ నగరంలో (Nizamabad City) రాత్రి 11 గంటల తర్వాత అన్ని దుకాణాలను మూసి వేయాలని ఇది వరకే సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం నగరంలో నిత్యం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ దుకాణాలు మూసి వేయిస్తున్నారు. రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లు, టీ కొట్టు, పాన్ షాపులు నిర్వహించే వారిని అరెస్ట్ చేసి కోర్టులో సైతం ప్రవేశ పెడుతున్నారు. ఇలా అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచిన పలువురికి కోర్టు జైలు శిక్ష కూడా విధించింది. అయితే నగరంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఓ టీ పాయింట్ అర్ధరాత్రి వరకు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
Nizamabad | ఆరో టౌన్ పరిధిలో..
నగరంలోని ఆరో టౌన్ పరిధిలో బోధన్ రోడ్డు (Bodhan Road)లో సారంగాపూర్ పాత సీఆర్పీఎఫ్ క్యాంపునకు ఎదురుగా ఓ టీ పాయింట్ ఉంది. దీనిని అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్నారు. మిగతా దుకాణాలు మూసి వేయిస్తున్న పోలీసులు దీని గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో రాత్రి వరకు ఇక్కడ యువత భారీగా గుమిగూడుతున్నారు. గుట్కాలు, సిగరెట్లు, గంజాయి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి వరకు టీ పాయింట్ నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.