అక్షరటుడే, నేషనల్ డెస్క్ : H-1B Visa | అమెరికాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ట్రంప్ భారీగా పెంచడంతో.. ఆ స్థానాల్లో అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత వస్తువులపై ఆయన భారీగా సుంకాలు విధించారు. అలాగే భారతీయులు అధికంగా తీసుకునే హెచ్–1బీ వీసాల (H-1B Visa) దరఖాస్తు ఫీజును సైతం ట్రంప్ భారీగా పెంచారు. ఈ క్రమంలో భారతీయ టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హెచ్–1బీ వీసా హోల్డర్ల హైరింగ్ ఉండబోదని టీసీఎస్ సీఈవో కృతివాసన్ (TCS CEO Krithivasan) వెల్లడించారు. అగ్రరాజ్యంలో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులనే నియమించుకోవాలని సంస్థ భావిస్తోంది.
H-1B Visa | టీసీఎస్‌లోనే అధికం
అమెరికాలో చాలా భారత ఐటీ కంపెనీలు (Indian IT Companies) సేవలు అందిస్తున్నాయి. అయితే ఆయా కంపెనీల్లో అత్యధికంగా హెచ్1బీ వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ టీసీఎస్. 2009 నుంచి 2025 మధ్య ఆ కంపెనీ ఏకంగా 98,259 మంది టెక్కీలను హెచ్–1బీ వీసా కింద నియమించుకుంది. కానీ ప్రస్తుతం ట్రంప్ కఠిన చర్యలతో ఆ సంస్థ సైతం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ వాస్తవానికి పొందిన హెచ్1బీ వీసాల లిమిట్ కంటే తక్కువగా బయటి ఉద్యోగులను నియమించుకుంటుంది. ఆ స్థానాల్లో అమెరికాలోని టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తోంది.
H-1B Visa | భారత్‌లో లేఆఫ్‌లు
టీసీఎస్ ఇప్పటికే భారత్‌లో ఉద్యోగులను తొలగిస్తుంది. తాజాగా అమెరికాలో సైతం భారతీయ ఉద్యోగుల నియామకాలను తగ్గించనుంది. దీంతో ఇండియన్ టెకీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాగా టీసీఎస్ తన వ్యాపార పంథాను సైతం మారుస్తోంది. ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు 7 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.
H-1B Visa | 32 వేల మంది ఉద్యోగులు
సీఈవో కృతివాసన్ మాట్లాడుతూ.. తమకు యూఎస్‌లో దాదాపు 32 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. వారిలో 11 వేల నుంచి 12 వేల మంది మాత్రమే హెచ్–1బీ వీసాపై (H-1B Visa) ఉన్నారని, మిగతా వారు ఇతర రకాల వీసాలపై ఉన్నట్లు వెల్లడించారు. స్థానిక శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి యూఎస్‌కు H-1B వీసాలపై 500 మందిని మాత్రమే పంపినట్లు ఆయన తెలిపారు. తాము ఆ వీసాలపై ఆధారపడటం లేదని స్పష్టం చేశారు.