అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata Sierra Bookings Milestone | టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల ప్రారంభించిన కొత్తతరం సియెర్రా.. వేగంగా లక్ష బుకింగ్స్ మైలురాయిని దాటింది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాను పెంచడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ వాహనం బుకింగ్స్ డిసెంబర్ 16 న ప్రారంభమైన విషయం తెలిసిందే. బుకింగ్స్ ప్రారంభించిన రోజే 70 వేల కార్లు బుక్ అయ్యాయి. ఆ తర్వాత కూడా జోరు కొనసాగింది. ప్రస్తుతం లక్ష బుకింగ్స్ మైలురాయిని దాటామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శైలేష్ చంద్ర (CEO Shailesh Chandra) తెలిపారు. బుక్ చేసుకున్నవారికి త్వరలోనే డెలివరీ ఇస్తామని పేర్కొన్నారు.
ప్రీమియం ఎస్యూవీ అయిన 5 సీటర్ టాటా సియెర్రా క్యాబిన్ కర్వ్ మాదిరిగానే ఉన్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడించింది. డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చారు. సన్ రూఫ్‌ను మరికాస్త విశాలంగా ఇచ్చారు. ఈ కారు అన్ని వర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లున్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (సుమారు 158 బీహెచ్పీ) మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో లభిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). త్వరలో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.