అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata Motors | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ నెల వ్యవధిలోనే లక్షకుపైగా కార్లను విక్రయించి చరిత్ర సృష్టించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 33 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. సెస్‌ను పూర్తిగా తొలగించింది. దీంతో టాటా కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ధరలు దిగి రావడంతో దసరా, దీపావళి(Diwali) సీజన్లలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ సంస్కరణలు గతనెల 22 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అక్టోబర్ 21 వరకు అంటే నెలరోజుల్లో టాటా మోటార్స్ లక్షకుపైగా కార్లను డెలివరీ చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో భారీ స్థాయిలో విక్రయాలు జరిగాయి. ప్రధానంగా తమ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (SUV)తోపాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను (EV)కు ఆదరణ లభించిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. శరన్నవరాత్రులు మొదలైన నాటినుంచి దీపావళి వరకు ఈనెల రోజులలో లక్షకుపైగా కార్ల డెలివరీలు చేశామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఇది కంపెనీకి సంబంధించి ఓ చారిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించారు. ఈ వృద్ధికి ఎస్‌యూవీలు ప్రధాన కారణంగా నిలిచాయన్నారు.
Tata Motors | నెక్సాన్ అమ్మకాల్లో 73 శాతం వృద్ధి..
ప్రధానంగా టాటా నెక్సాన్ (Tata Nexon) 38 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కార్ల అమ్మకాలలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 73 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. నెక్సాన్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ సహా ఎలక్ట్రిక్ వేరియంట్లలోనూ అమ్మకాలు భారీగానే జరిగాయి. తర్వాత స్థానంలో టాటా పంచ్(Tata Punch) నిలిచింది. 32 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోల్చితే 29 శాతం అధికం. ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో కూడా బలంగానే ఉంది. 10 వేలకుపైగా ఈవీ యూనిట్లను విక్రయించారు. గతేడాదితో పోల్చితే 37 శాతం వృద్ధి నమోదైంది.