Homeబిజినెస్​Tata Capital IPO | టాటా క్యాపిటల్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ఫిక్స్‌.. రూ. 15,511 కోట్లతో...

Tata Capital IPO | టాటా క్యాపిటల్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ఫిక్స్‌.. రూ. 15,511 కోట్లతో ఐపీవోకు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Capital IPO | టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న మరో అతిపెద్ద ఐపీవో సైజ్‌తోపాటు ప్రైస్‌బాండ్‌ ఖరారయ్యాయి. ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 15,511.87 కోట్లు సమీకరించనుంది. వచ్చేనెల 6వ తేదీన ప్రారంభమయ్యే ఐపీవో(IPO) వివరాలిలా ఉన్నాయి.

టాటా గ్రూప్‌నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అయిన టాటా క్యాపిటల్‌(Tata Capital) 2022 సెప్టెంబర్‌లో అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ(NBFC)గా గుర్తింపు పొందింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు తప్పనిసరిగా మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో లిస్టవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ కంపెనీ 2025 సెప్టెంబర్‌లోగానే పబ్లిక్‌ ఇష్యూకు రావాల్సి ఉంది. అయితే వారం రోజుల ఆలస్యంగా ఐపీవోకు వస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 25 విభాగాల్లో 70 లక్షల కస్టమర్లకు సేవలందిస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 15,511.87 కోట్లు సమీకరించాలన్నది టాటా క్యాపిటల్‌ లక్ష్యం. 21 కోట్ల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 6,846 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన 26.58 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా మరో 8,665.87 కోట్లను సమీకరించనుంది.

ఐపీవో ద్వారా వచ్చిన నిధులను భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకుగాను టైర్‌-1 మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ ఇష్యూ విజయవంతమైతే దేశీయ ఫైనాన్షియల్‌ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్‌ సృష్టించనుంది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(HDB Financial servises) రూ. 12,500 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే.

ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌ : 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,198.38 కోట్లు ఉన్న ఆదాయం(Revenue) 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 28,369.87 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం రూ. 3,326.96 కోట్లనుంచి రూ. 3,655.02 కోట్లకు పెరిగింది. ఆస్తులు 1.76 లక్షల కోట్లనుంచి రూ. 2.48 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. కాగా ప్రస్తుతం అప్పులు రూ. 2.08 కోట్లు ఉన్నాయి.

ప్రైస్‌ బ్యాండ్‌ : ఒక్కో ఈక్విటీ షేరు ధరను కంపెనీ రూ. 310 నుంచి రూ. 326 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 46 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కోసం రూ. 14,996తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ : ఈ ఇష్యూలో క్యూఐబీలకు 50 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 28 గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో 8 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) అక్టోబర్‌ 6వ తేదీన ప్రారంభమవుతుంది. 8వ తేదీన ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 9వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 13వ తేదీన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టవుతాయి. యాంకర్‌ ఇన్వెస్టర్స్‌ కోసం ఈ ఐపీవో అక్టోబర్‌ 3వ తేదీనే అందుబాటులోకి రానుంది.

Tata Capital IPO | భారీ డిస్కౌంట్‌లో పబ్లిక్‌ ఇష్యూకు!

అన్‌లిస్టెడ్‌ స్పేస్‌(Unlisted Space)లో టాటా క్యాపిటల్‌ షేర్లకు భారీ డిమాండ్‌ ఉండేది. సెప్టెంబర్‌ 28న ఒక్కో షేరు ధర రూ.735 గా ఉంది. కాగా ఈ కంపెనీ షేర్లు 2024 సెప్టెంబర్‌లో రూ. 1,095 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. ఇది 52 వారాల గరిష్ట ధర. అయితే ప్రస్తుతం అన్‌లిస్టెడ్‌ స్పేస్‌లో ట్రేడ్‌ అవుతున్న షేర్‌ ప్రైస్‌లో సగానికన్నా తక్కువ ధరకే టాటా క్యాపిటల్‌ ఐపీవోకు వస్తుండడం గమనార్హం

Must Read
Related News