అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata Capital IPO | టాటా గ్రూప్(Tata Group)నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC) అయిన టాటా క్యాపిటల్ షేర్లు సోమవారం లిస్టయ్యాయి. లిస్టింగ్ గెయిన్స్ ఆశించిన ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ నిరాశను మిగిల్చింది. ఐపీవో(IPO) ప్రైస్ రూ. 326 కాగా.. రూ. 330 వద్ద లిస్టయ్యింది. అదే ధర వద్ద కదలాడుతోంది.
మార్కెట్‌నుంచి రూ. 15,511.87 కోట్లు సమీకరించడం కోసం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ (Public issue)కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 21 కోట్ల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 6,846 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన 26.58 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా మరో 8,665.87 కోట్లను సమీకరించింది. అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ (Subscription) 8వ తేదీన ముగిసింది. ఇది దేశీయ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ సృష్టించింది. కంపెనీ షేర్లు సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 326 కాగా.. రూ. 330 వద్ద లిస్టయ్యింది. లిస్టింగ్ సమయంలో 1.23 శాతం లాభాలు మాత్రమే వచ్చాయి. రూ. 326 నుంచి రూ. 332 మధ్యలో ట్రేడ్ అవుతోంది.
Tata Capital IPO | ఎల్‌జీపైనే అందరి దృష్టి..
గతవారంలో రెండు భారీ ఐపీవోలు వచ్చాయి. టాటా క్యాపిటల్ రూ. 15,511.87 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు రాగా.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా(LG Electronics India) రూ. 11,607 కోట్లు సమీకరించింది. ఇందులో టాటా క్యాపిటల్ సోమవారం లిస్ట్‌కాగా.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మంగళవారం లిస్ట్ కానుంది. ఈ ఏడాది భారీ ఐపీవోగా వచ్చిన టాటా క్యాపిటల్ లిస్టింగ్ సమయంలో నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద ఐపీవో అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ కంపెనీ షేర్లకు భారీ స్పందన రావడం, గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) బాగుండడంతో మంచి లిస్టింగ్ గేయిన్స్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు.