HomeతెలంగాణTaskForce Police | టాస్క్​ఫోర్స్​ సమూల ప్రక్షాళన.. ఏకంగా 14 మందిపై బదిలీ వేటు

TaskForce Police | టాస్క్​ఫోర్స్​ సమూల ప్రక్షాళన.. ఏకంగా 14 మందిపై బదిలీ వేటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TaskForce Police | నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (CP Sai Chaitanya) కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్​ టాస్క్​ఫోర్స్​ను (Commissionerate Task Force) పూర్తిస్థాయి ప్రక్షాళన చేశారు. ఒకే రోజులో ఏకంగా 14 మందిపై బదిలీ వేటు వేశారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, మిగతా వారు సిబ్బంది ఉన్నారు. కాగా.. సీపీ తీసుకున్న నిర్ణయం కమిషనరేట్​ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

కమిషనరేట్​లోని టాస్క్​ఫోర్స్​ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విభాగంలో పనిచేసిన ఏసీపీ విష్ణుమూర్తి (ACP Vishnu Murthy) తీవ్ర అవినీతి ఆరోపణల కారణంతో విధుల నుంచి సస్పెన్షన్​కు గురయ్యారు. ఆ తర్వాత ఈ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం ఈ విభాగంలో పనిచేస్తున్న కొందరి తీరు మాత్రం మారలేదు. ఇటీవల ఏఆర్​ నుంచి టాస్క్​ఫోర్స్​ అటాచ్​ చేసిన పలువురి పనితీరుపై విమర్శలు వచ్చాయి. కాగా.. టాస్క్​ఫోర్స్​ అధికారులు, సిబ్బంది తీరుపై కొద్దిరోజులుగా పర్యవేక్షణ జరిపిన సీపీ సాయిచైతన్య తనదైన శైలిలో ప్రక్షాళన చేపట్టారు.

TaskForce Police | సీఐ, ఇద్దరు ఎస్సైలు..

ప్రస్తుతం టాస్క్​ఫోర్స్​ విభాగంలో (task force department) పనిచేస్తున్న ఇన్​స్పెక్టర్​ అంజయ్యను సీసీఆర్​బీకి బదిలీ చేశారు. అలాగే ఎస్సై గోవింద్​ను ఆర్మూర్​కు, మరో ఎస్సై శివరాంను సీసీఆర్​బీకి అటాచ్​ చేశారు. సిబ్బంది యాకుబ్​ రెడ్డిని సీసీఆర్​బీకి, లస్మన్నను భీమ్​గల్​ పీఎస్​కు, సుధీర్​ను రెంజల్​ పీఎస్​కు, అనిల్​ కుమార్​ను సీసీఎస్​కు, రాజును బోధన్​ టౌన్​కు పంపించారు. సచిన్​ను భీమ్​గల్​కు, అన్వర్​ను బోధన్​ టౌన్​కు, అనిల్​, శ్రీనివాస్​, ఎన్​.సచిన్​, సాయినాథ్​లను ఏఆర్​ హెడ్​క్వార్టర్స్​కు అటాచ్​ చేశారు. సత్వరమే ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్​ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

TaskForce Police | కొత్తవారికి ఛాన్స్​

అసాంఘిక కార్యకలాపాలు (anti-social activities), అక్రమ రవాణా తదితర నేరాల కట్టడిలో టాస్క్​ఫోర్స్​ పాత్ర ఎంతో కీలకం. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కాగా నిఘా ఉంచి దాడులు జరిపితేనే అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకోవడం పోలీస్​ శాఖకే (police department) చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. దీంతో టాస్క్​ఫోర్స్​ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసిన కమిషనరేట్​ బాస్​ సాయిచైతన్య త్వరలోనే కొత్తవారిని నియమించనున్నారు. ఇందుకోసం ఎలాంటి రిమార్కు లేని వారికోసం టాస్క్​ఫోర్స్​ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.