అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ukrain President Zelensky | రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా భారత్‌పై సుంకాలు విధించడం సరైన నిర్ణయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీఅన్నారు.
రష్యా(Russia)తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న భారతదేశంతో సహా ఇతర వాణిజ్య భాగస్వాములపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను సమర్థించారు. ఇది సరైన నిర్ణయమని అభివర్ణించారు. అమెరికన్ ప్రసార సంస్థ ABCతో మాట్లాడిన జెలెన్ స్కీ (Zelensky) మాస్కో ఇంధన వాణిజ్యాన్ని ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆయుధంగా మార్చుకున్నారని అభివర్ణించారు. రష్యా నుంచి ఎగుమతులను ఎవరూ కొనుగోలు చేయొద్దని కోరారు.
Ukrain President Zelensky | ఈయూ దేశాలపై ఆగ్రహం
రష్యాతో ఒప్పందాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించాలనే ఆలోచన సరైన ఆలోచన అని నేను భావిస్తున్నానని జెలెన్ స్కీ తెలిపారు. చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం గురించి అడిగినప్పుడు జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. మాస్కోతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలపైనా జెలెన్ స్కీ విమర్శలు చేశారు. రష్యా నుంచి ఏ రకమైన ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని కోరారు. “పుతిన్‌పై అదనపు ఒత్తిడి అవసరమని అందరం అర్థం చేసుకున్నాము. ఈ విషయంలో అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా మరింత ఒత్తిడి తేవాలి. కానీ కొన్ని దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇది న్యాయం కాదు.. రష్యా నుండి కొనుగోలు చేయడం మానేయాలి.. రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై సుంకాలు విధించాలనే ఆలోచన సరైన ఆలోచన అని నేను భావిస్తున్నానని” తెలిపారు.
Ukrain President Zelensky | ఆయుధాన్ని అందించకూడదు..
రష్యా అధ్యక్షుడ్ని హంతకుడిగా జెలెన్‌స్కీ అభివర్ణించారు. అతడ్ని ఆపాలంటే ఆయుధాన్ని అందివ్వకూడదని సూచించారు. “హంతకుడిని ఆపడానికి ఉన్న ఒకే ఒక మార్గం వారితో వాణిజ్య సంబంధాలు దూరం చేసుకోవడమే. మీరు అతని ఆయుధాన్ని తీసివేయాలి, అంటే అతని నుంచి ఏవీ కొనకూడదు” జెలెన్ స్కీ తెలిపారు. అలాస్కాలో ట్రంప్, పుతిన్ సమావేశంపై స్పందిస్తూ.. “ఉక్రెయిన్ అక్కడ లేకపోవడం విచారకరం” అని అన్నారు. “ట్రంప్(Donald Trump) పుతిన్‌కు కోరుకున్నది ఇచ్చాడు… అమెరికా అధ్యక్షుడిని కలవాలనుకున్నాడు… తాను అక్కడ ఉన్నానని అందరికీ చూపించాలనుకున్నాడు” అని జెలెన్స్కీ అన్నారు. చర్చల కోసం మాస్కోకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. “ఆయన (పుతిన్) కైవ్‌కు రావచ్చు… నా దేశం క్షిపణుల బారిన పడినప్పుడు నేను మాస్కోకు వెళ్లలేను” అని చెప్పారు.