అక్షరటుడే, వెబ్‌డెస్క్: Boycott Tariffs | రష్యా నుంచి చమురు (Russia Oil) కొంటుందన్న అక్కసుతో భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీరుపై భారతీయుల నుంచే కాకుండా అమెరికన్లలోనూ నిరసన వెల్లువెత్తుతోంది.
భారత్ కంటే అత్యధికంగా చమురు కొంటున్న చైనా వంటి దేశాలపై చర్యలు చేపట్టకుండా భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు దీటుగా కేంద్ర ప్రభుత్వం జవాబు చెబుతోంది. రైతులు (Farmers), చిరు వ్యాపారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టంగా చెప్పేసింది. అదే సమయంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, అగ్రరాజ్యం దుందుడుకు చర్యలను వ్యాపారులు, సామాజికవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విదేశీ ఉత్పత్తులను (foreign products) బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో కేంద్రానికి బాసటగా నిలబడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహిద్దామని కోరుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ మేడిన్ (Prime Minister Modi) ఇండియా వస్తువులనే వినియోగించాలని పిలుపునివ్వగా, ఇప్పుడు రామ్‌దేవ్ బాబా కూడా ఈ జాబితాలో చేరారు.
Boycott Tariffs | వెనక్కు తగ్గని భారత్..
రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణాన్ని చూపుతూ ట్రంప్ భారత్‌పై టారిఫ్ విధించారు. రెండు విడుతల్లో కలిపి 50 శాతం సుంకాలు పెంచగా, అవి బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ట్రంప్ వైఖరి వల్ల భారత్, అమెరికా (India-america) మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో పడ్డాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి బీటలు వారే పరిస్థితులు నెలకొన్నాయి. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తున్నాయి.
అనేక దేశాలపై సుంకాలు విధించడం ద్వారా తన దారికి తెచ్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు అగ్రరాజ్యంతో ఒప్పందాలు చేసుకోగా, మరికొన్ని ఆ దిశగా సాగుతున్నాయి. కానీ ఇండియా మాత్రం అమెరికాతో ఒప్పందానికి ససేమీరా అంటోంది. రైతులు, పశు పోషకులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను బలి పెట్టే ఒప్పందాలను అంగీకరించడం లేదు. ఈ క్రమంలో ట్రంప్ ఎంత ఒత్తిడి తెస్తున్నా వెనక్కి తగ్గడం లేదు.
Boycott Tariffs | ఊపందుకుంటున్న స్వదేశీ నినాదం
ట్రంప్ టారిఫ్‌ల (Trump Tarrifs) నేపథ్యంలో ఇండియాలో ఇప్పడు స్వదేశీ నినాదం ఊపందుకుంటోంది. అమెరికా కంపెనీలను బహిష్కరించాలన్న ప్రచారం ఉధృతమవుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇటీవల అహ్మదాబాద్‌లో (Ahmedabad) పర్యటించిన సందర్భంలో ప్రధాని మాట్లాడుతూ.. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రతి దుకాణం వద్ద స్వదేశీ వస్తువులునే విక్రయిస్తున్నట్లు పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలని సూచించారు. స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు, విక్రయాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఆయన పిలుపునకు అనేక మంది రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) కూడా చేరారు. రష్యా నుంచి చమురు కొంటుందున్న అక్కసుతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించినందుకు గాను అమెరికన్ కంపెనీలు, బ్రాండ్ల ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ సుంకాలను రాజకీయ బెదిరింపు, గూండాయిజం, నియంతృత్వంగా అభివర్ణించిన రామ్‌దేవ్.. అమెరికా సుంకాలను భారత పౌరులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. అదే సమయంలో అమెరికన్ కంపెనీలు, బ్రాండ్‌లను పూర్తిగా బహిష్కరించాలని సూచించారు. పెప్సి, కోకా-కోలా, సబ్‌వే, KFC, మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ల నుంచి కొనుగోలు చేయడం మానేయాలని ప్రజలను కోరారు. అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే ఆ దేశంతో గందరగోళం ఏర్పడుతుందని, అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దీంతో ట్రంప్ సుంకాలను ఉపసహించుకునే పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు.