అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariff | ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (US President Donald Trump) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశంలోనే అధ్యక్షుడి నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ట్రంప్ చర్యలు అమెరికాకు మంచివి కావని, దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేసే చర్యలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా మాజీ ప్రజాప్రతినిధులు, ఆర్థిక నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. సుంకాల వల్ల అమెరికన్లకు లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉన్న భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించడాన్ని చాలా తప్పుబడుతున్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకుని సంబంధాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trump Tariff | తనకు తానే నాశనం
మిగతా ప్రపంచంపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నాడని అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే (University professor Steve Hanke) పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల నిర్ణయం పూర్తిగా చెత్త, అర్థరహితమని కొట్టి పడేశారు. తనకు తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిదనే నెపోలియన్ మాటలను గుర్తు చేసిన ఆయన.. ప్రస్తుత వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో ప్రధాని మోదీ (Prime Minister Modi), విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (External Affairs Minister Jaishankar) కొన్నాళ్లు వేచి ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ట్రంప్ నిర్మించిన వాణిజ్య సుంకాల పేకమేడ త్వరలోనే కూలిపోతుందని తెలిపారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికన్లకే ఎక్కువ నష్టమని తెలిపారు. అమెరికన్లు ఖర్చు చేస్తున్నది స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఉండటం వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటు ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
Trump Tariff | ఇరుదేశాలకు ముప్పు..
అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు దేశానికి మంచిది కాదని అమెరికా మాజీ మాజీ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్‌బెల్ విమర్శించారు. ట్రంప్ వైఖరి వల్ల భారత్, అమెరికా సంబంధాలు (India-US relations) దారుణంగా దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “21వ శతాబ్దంలో అమెరికాకు ఇండియాతో అత్యంత కీలక, వ్యూహాత్మక సంబంధాలు ఏర్పడ్డాయి. అందులో ఎక్కువ భాగం ఇప్పుడు ప్రమాదంలో పడింది” అని అన్నారు.
“అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, ప్రధాని మోదీ గురించి మాట్లాడిన విధానం భారత ప్రభుత్వాన్ని క్లిష్ట స్థితిలో ఉంచిందని” పేర్కొన్నారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నటికీ ట్రంప్‌కు మోకరిల్లకూడదని ఆయన సలహా ఇచ్చారు. రష్యాతో సంబంధాల గురించి అమెరికా భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందన్నారు. “రష్యాతో తన సంబంధాన్ని త్యాగం చేయాలని మీరు భారతదేశానికి చెబితే, భారత వ్యూహకర్తలు దానికి పూర్తిగా విరుద్ధంగా చేస్తారు” అని కాంప్‌బెల్ ట్రంప్‌ను హెచ్చరించారు.
