అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | యూరియా, ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Tummala Nageshwar Ra), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయం నుండి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపి తదితరులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న యూరియా ఎరువుల నిల్వలు, పంపిణీ తీరుతెన్నులను సమీక్షిస్తూ, కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను (task force teams) నియమించుకుని, ఎక్కడ కూడా యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని మంత్రి తుమ్మల సూచించారు. ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించి సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం వల్ల పత్తి, వరి, మొక్కజొన్న తదితర అన్ని రకాల పంటలను రాష్ట్రవ్యాప్తంగా రైతులు (Farmers) ఏకకాలంలో సాగు చేస్తున్నారని అన్నారు.
దీంతో గతేడాదితో పోలిస్తే.. ఈ సీజన్లో ఇదే సమయానికి ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే అనేక కారణాల వల్ల కేంద్రం నుండి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు (urea stocks) రాష్ట్రానికి రావడం లేదని, కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని మంత్రి వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ఎరువులను, ప్రత్యేకించి యూరియా నిల్వలను సజావుగా పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు హితవు పలికారు.
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలోని ఆయా మండలాల వారీగా సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను నిరంతరం పరిశీలన చేస్తూ, అవసరం ఉన్న ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని సూచించారు.
యూరియా అక్రమ రవాణా జరగకుండా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా కోళ్ల ఫారాలు, పేపర్ మిల్లులు (paper mills), ఆయా పరిశ్రమలలో తనిఖీలు జరపాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్‌లను నెలకొల్పి, యూరియా ఎరువులు దారి మళ్లకుండా చూడాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. అదే సమయంలో యూరియాను అవసరానికి మించి వినియోగించకుండా, ఒకేసారి ఏకమొత్తంలో యూరియా కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Nizamabad Collector | యూరియా జిల్లా సరిహద్దులు దాటవద్దు..: కలెక్టర్
జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) స్పష్టం చేశారు. వీసీలో పాల్గొన్న అనంతరం సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సొసైటీల్లో ఎరువుల స్టాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రైవేట్ విక్రయ కేంద్రాలను కూడా మండల వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూడాలన్నారు.
ఎక్కడైనా ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడం, బ్లాక్ మార్కెట్ కు తరలించడం, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరపడం, ఎరువులను పక్కదారి పట్టించడం వంటివి గుర్తిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్(Rabi season)లో కూడా ఎరువుల కొరత నెలకొనకుండా ఇప్పటినుండే ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), జిల్లా వ్యవసాయ అధికారి జె.గోవిందు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.