అక్షరటుడే, కామారెడ్డి: Cancer screening test | జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.మధు దేవర శెట్టి సూచించారు. గురువారం ఆయన స్థానిక రోటరీ క్లబ్ భవనంలో (Rotary Club) మీడియాతో మాట్లాడారు. ఈనెల 26న కిమ్స్ ఆస్పత్రి (KIMS Hospitals) ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో (Kalabharti Auditorium) ఉచిత కంటి పరీక్షను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స చేసుకునే అవకాశం ఉందన్నారు. కొత్త టెక్నాలజీతో క్యాన్సర్ ట్రీట్మెంట్ సులభమైందన్నారు. క్యాన్సర్ పరీక్ష చేసుకోవడానికి భయపడవద్దని సూచించారు. క్యాన్సర్‌ను పూర్తిగా అరికట్టలేమని, తగ్గించే ప్రయత్నం చేయవచ్చన్నారు. క్యాన్సర్ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయన్నారు. రొమ్ములో గడ్డలు కావడం, నోటిలో గడ్డలు కావడం, ఎక్కువకాలం దగ్గు ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా మామోగ్రఫీ (Mammography), ఎక్స్ రే, ఎండోస్కోపి, అల్ట్రా సౌండ్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
సాధారణంగా ఈ పరీక్షలు చేసుకుంటే రూ.17,100 ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా చేసుకోవచ్చన్నారు. పరీక్షకు వచ్చే ముందు తినకుండా రావాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి(Rotary Club of Kamareddy), ఐఎంఏ (IMA) వారి సహకారంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత క్యాంప్ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శంకర్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి, ఐఎంఏ సెక్రెటరీ డా. అరవింద్, రోటరీ సెక్రటరీ కృష్ణహరి, డా.గీరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
