Taj Mahal
Taj Mahal | ప్ర‌మాదంలో తాజ్ మ‌హ‌ల్.. ప్రధాన గుమ్మటానికి బీటలు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Taj Mahal | దేశంలో ప్ర‌ముఖ‌ చారిత్రక కట్టడాల‌లో తాజ్ మ‌హ‌ల్ ఒక‌టి. ప్రేమకు చిహ్నంగా భారతీయులు ఈ కట్టడాన్ని భావిస్తూ ఉంటారు. సుమారు 373 ఏళ్ల క్రితం నిర్మిత‌మైన క‌ట్ట‌డం చెక్కుచెదరకుండా కోట్ల మంది పర్యాటకులకు(Tourists) క‌నువిందు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ క‌ట్ట‌డం ప్ర‌మాదంలో ప‌డింది. గుమ్మ‌టానికి పగుళ్లు ఏర్పడినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఆగ్రా(Agra)లోని ఈ అపురూప స్మారక చిహ్నం నుంచి నీరు కారుతోందన్న వార్త కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 73 మీటర్ల ఎత్తులో ఉన్న గోపురం (మినారెట్) నుంచి నీరు కారుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Taj Mahal | తాజ్ మ‌హ‌ల్‌కి ఏమైంది..

ఈ విచిత్ర పరిస్థితి నేపథ్యంలో, అక్కడ రంధ్రాలున్నాయా? నీరు ఎలా చేరుతుంది? అన్న ప్రశ్నలు కలుగుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు భారత పురావస్తు సర్వే (Archaeological Survey of India) రంగంలోకి దిగింది. ASI బృందం తాజ్ మహల్‌(Taj Mahal)ను థర్మల్ స్కానింగ్తో పరిశీలించినప్పుడు ఈ నీటి లీకేజీ స్పష్టంగా కనిపించింది. అదీ ఏకంగా 73 మీటర్ల ఎత్తులో. ఆధునిక దర్యాప్తు కోసం లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (LiDAR) టెక్నిక్‌ను, అలాగే GPS, డ్రోన్లు, స్కానర్లు వంటివి ఉపయోగించారు. దర్యాప్తులో మూడు ప్రధాన కారణాలు గుర్తించబడ్డాయి. గోపురం నిర్మాణానికి ఉపయోగించిన రాతి మోర్టార్ కాలక్రమంలో దెబ్బతింది.

గోపురం పైకప్పు తలుపు, నేల చెడిపోయింది. అలానే గోపురంపై ఉన్న కలశం కూడా పాడైంద‌ని అంటున్నారు. నిజానికి కలశం ఉన్న ఇనుప రాడ్ తుప్పు పట్ట‌డంతో దాని చుట్టూ ఉన్న మోర్టార్ ఉబ్బిపోయింది. నీరు లీక్ కావడానికి ఇదే కారణమని అంటున్నారు. ప్రస్తుతం ASI బృందం గోపురంపై స్కాఫోల్డింగ్(Scaffolding) ని ఏర్పాటు చేసి మరమ్మత్తుల కోసం వివరంగా అధ్యయనం చేస్తోంది. 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వనుండగా, పూర్తి మరమ్మతులకు సుమారు 6 నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా. తాజ్ మహల్ ఔరంగజేబు(Aurangzeb) కాలంలో అంటే 1652 లో తొలిసారి నీళ్లు లీక్ అయిన‌ట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో మరమ్మతులు చేప‌ట్ట‌గా, ఆ తర్వాత 1872లో మ‌ళ్లీ లీక్ అయింది. అప్పటి ఇంజినీర్ జేడబ్ల్యూ అలెగ్జాండర్(JW Alexander) రిపేర్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత మ‌ళ్లీ 1941లోనూ మరమ్మతులు చేపట్టారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే లీకేజీ స‌మ‌స్య వ‌చ్చింద‌ని అంటున్నారు. తాజ్ మ‌హ‌ల్ ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల‌లో ఒక‌టి అన్న విష‌యం తెలిసిందే. 1632 నుంచి 1648 మధ్య కాలంలో ఆనాటి దిల్లీ సుల్తాన్ షాజహాన్(Delhi Sultan Shah Jahan) కాలంలో ఈ క‌ట్ట‌డాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. పూర్తిగా పాలరాతితో ఈ అపురూప కళా కృతిని క‌ట్ట‌గా, దీనికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.