అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు.
ఏసీబీ అధికారులు (ACB Officers) దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్నా.. లంచాలకు మరిగిన కొందరు మాత్రం భయపడడం లేదు. తాజాగా రైతు భూ రికార్డుల్లో తప్పులు సవరించడానికి లంచం తీసుకుంటుండగా తహశీల్దార్(Tahsildar), సర్వేయర్‌ను (Surveyor) ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్
ఓ మహిళకు సంబంధించిన భూమిని నమోదు చేయడంతో పాటు, రికార్డుల్లో ముద్రణా లోపాలను సవరించడానికి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఆమనగల్ తహశీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.50 వేలు ఇప్పటికే తీసుకున్నారు. మరో రూ.50 వేల కోసం రైతును వేధిస్తున్నారు. దీంతో సదరు మహిళ మనవడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం మిగతా రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. తహశీల్దార్ లలిత, సర్వేయర్ రవిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | యథేచ్ఛగా అవినీతి..
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో (Tahsildar Offices) యథేచ్ఛగా అవినీతి సాగుతోంది. అటెండర్, ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆపరేటర్ల ద్వారా తహశీల్దార్లు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు కొంత మొత్తం పక్కా వసూలు చేస్తున్నారు. అందులో ఏదైనా తప్పిదం ఉంటే.. వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
