HomeతెలంగాణAIG Hospitals | ఏఐజీ ఆస్పత్రిలో ఠాగూర్​ సీన్​ రిపీట్​.. రూ.85 లక్షల బిల్లు కట్టించుకొని...

AIG Hospitals | ఏఐజీ ఆస్పత్రిలో ఠాగూర్​ సీన్​ రిపీట్​.. రూ.85 లక్షల బిల్లు కట్టించుకొని శవాన్ని అప్పగించిన వైద్యులు

AIG Hospitals | హైదరాబాద్​ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో రోగి మరణించినా చెప్పకుండా బిల్లు కట్టించుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIG Hospitals | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ఓ కార్పొరేట్​ ఆస్పత్రిలో ఠాగూర్​ సినిమా మాదిరి సీన్​ రిపీట్​ అయింది. రూ.85 లక్షల బిల్లు కట్టాక రోగి చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

నగరంలోని కుత్బుల్లాపూర్‌ గాంధీ నగర్‌కు చెందిన మురళీధర్ (40) లివర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. లివర్ మార్పిడి కోసం నెలన్నర క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు లివర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ (Liver transplantation) చేయాలని చెప్పారు. దీనికి రూ.35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారు. బాధితుడి భార్య లివర్​ ఇచ్చింది. తీరా ఆపరేషన్​ చేశాక వైద్యులు రూ.85 లక్షల బిల్లు వేశారు. అప్పులు చేసి, ఇల్లు అమ్ముకొని బాధిత కుటుంబ సభ్యులు బిల్లు చెల్లించారు. బిల్లు కట్టిన తర్వాత సదరు వ్యక్తి చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AIG Hospitals | న్యాయం చేయాలని ఆందోళన

కాగా బాధితుడు రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య మాట్లాడుతూ.. లివర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ చేశాక కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారన్నారు. 15 రోజులుగా వైద్యం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆస్పత్రి బిల్లుల కోసం భూమి, ఇల్లు కూడా అమ్మేశానని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.85 లక్షల బిల్లు కట్టాక.. ఇక కట్టాలేమని తాము చెప్పడంతో వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారన్నారు.

అనంతరం అంబులెన్స్​లో తన భర్తను ఎక్కించిన తర్వాత చనిపోయాడని చెప్పారని ఆమె వాపోయింది. బిల్లు కోసమే తన భర్త చనిపోయిన విషయం దాచిపెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.