అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Taapsee | సినిమా అంటే ఓ టీమ్ వర్క్. ఆ టీమ్‌కు నాయకుడు దర్శకుడు. ప్రాజెక్ట్ లాక్ అయిన క్షణం నుంచి చివరి ఫ్రేమ్ వరకూ దర్శకుడి విజన్ (Director Vision)నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా, హీరోయిన్ అయినా దర్శకుడు చెప్పినట్టే నడుచుకోవాల్సిందే. అవసరమైతే నటీనటులు తమ లుక్, బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ వరకు మార్చుకోవాల్సి ఉంటుంది. “నాకు కుదరదు” అని కుంటిసాకులు చెబితే, చాలా మంది మేకర్స్ నేరుగా ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోమని కూడా చెప్పేస్తారు. ఇలాంటి కఠిన నియమాల మధ్య ఓ నటి మాత్రం దర్శకుల ఆలోచనలనే మార్చేసిందంటే ఆశ్చర్యమే.
Actress Taapsee | మాముల్ది కాదు..
ఇంతకీ ఆ నటి ఎవరు అంటే.. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన తాప్సీ. కెరీర్ ప్రారంభంలో తెలుగులో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ ప్రస్తుతం బిజీగానే ఉన్నప్పటికీ, ఇంకా తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లోనే ఉంది. ఈ క్రమంలో తాప్సీ ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన సహజమైన ఉంగరాల జుట్టే ఒక దశలో తన కెరీర్‌కు అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చింది. రింగుల్లా ఉండే హెయిర్ స్టైల్ (Hairstyle) కారణంగా ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయని తెలిపింది. “ఉంగరాల జుట్టు యాక్షన్ రోల్స్‌కే సరిపోతుంది, మిగతా పాత్రలకు పనికిరాదు” అంటూ కొందరు దర్శకులు తనను పక్కన పెట్టారని చెప్పింది. అవకాశాల కోసం కొన్నాళ్లు తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాల్సి వచ్చిందని కూడా గుర్తు చేసుకుంది.
వాస్తవానికి మొదట్లో తనకే ఉంగరాల జుట్టు నచ్చలేదని, కానీ కాలక్రమంలో దాని ప్రత్యేకత అర్థమై, అదే తన బలంగా మారిందని తాప్సీ వెల్లడించింది. ఉంగరాల జుట్టును ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా క్యారీ చేయాలి అనే విషయాల్లో అవగాహన పెంచుకున్న తర్వాత, దర్శకులను కూడా నెమ్మదిగా కన్విన్స్ చేయగలిగానని చెప్పింది. కొన్ని నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, కొందరు దర్శకులు “ఉంగరాల జుట్టు (Curly Hair) ఉన్న హీరోయిన్నే కావాలి” అంటూ ప్రత్యేకంగా తననే సంప్రదించారని తెలిపింది.ఇప్పుడు అయితే, ఉంగరాలు తీసేయాలా లేదా అన్న ఆప్షన్ దర్శకులకు ఇస్తే… “అదే నీ ప్రత్యేకత, అది లేకపోతే ఎలా?” అంటూ వారు మెచ్చుకుంటున్నారని తాప్సీ చెప్పింది. సినిమాలే కాదు, తన సహజమైన హెయిర్ స్టైల్ చూసి కొన్ని బ్రాండ్లు కూడా ఒప్పందాలు చేసుకున్నాయట. ఒకప్పుడు శాపంలా అనిపించిన ఉంగరాల జుట్టే ఇప్పుడు తనకు వరంగా మారిందని, అదే తన గుర్తింపుగా నిలిచిందని తాప్సీ ఆనందంగా వెల్లడించింది.