అక్షరటుడే, వెబ్‌డెస్క్: Credit Card | భారతదేశంలో కోవిడ్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) విస్తరించాయి. అంతటా క్యూఆర్ కోడ్‌తో (QR Code) చెల్లింపులను స్వీకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాలలోనూ స్కాన్ అండ్ పే సౌకర్యం ఉంది. దీంతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి.
ప్రస్తుతం భారతదేశ డిజిటల్ చెల్లింపుల్లో సుమారు 85 శాతం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. రూపేకు ప్రజాదరణ పెరగడానికి కారణం ఈ క్రెడిట్ కార్డులను దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే చెల్లింపు ప్లాట్‌ఫాం అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు లింక్ చేసుకునే సౌలభ్యం ఉండడం. ఇది రూపే కార్డుల విస్తరణకు దోహదపడుతోంది. కొత్త కార్డులు తీసుకునేవారే కాకుండా ఇతర నెట్‌వర్క్‌ల కార్డులున్నవారు సైతం రెండో కార్డుగా రూపే క్రెడిట్ కార్డులను (Rupay Credit Cards) ఎంచుకుంటున్నారు. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం ద్వారా వినియోగదారులు గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత చెల్లింపు గడువును పొందగలుగుతున్నారు.
మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉండడం రూపే కార్డులకు అనుకూలంగా మారింది. దీంతో క్రమంగా దేశీయ క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో రూపే వాటా పెరుగుతూ వస్తోంది. గతనెల(అక్టోబర్)లో రూపే కార్డుల వాటా 18 శాతానికి చేరింది. రెండేళ్ల క్రితం వరకు విదేశీ నెట్‌వర్క్‌లైన మాస్టర్ కార్డ్ (Master Card), వీసాల సంపూర్ణ ఆధిపత్యమే కనిపించేది. ఈ రెండేళ్ల కాలంలో రూపే క్రెడిట్ కార్డుల వాటా 3 నుంచి 18 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం కొత్తగా జారీ అవుతున్న క్రెడిట్ కార్డుల్లో మూడో వంతు రూపే కార్డులే ఉంటుండడం గమనార్హం. అలాగే మొత్తం లావాదేవీల విలువలో రూపే కార్డ్స్ వాటా సుమారు 25 శాతానికి చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Credit Card | రూ. 35 వేల కోట్లపైనే..
రూపే క్రెడిట్ కార్డుల ద్వారా గతనెలలో రూ. 35 వేల కోట్లపైనే లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో యూపీఐ ద్వారా యూపీఐ లావాదేవీల (UPI Transactions) విలువ రూ.18వేల కోట్లుగా ఉంది. ఒక్కో క్రెడిట్ కార్డుపై సగటు ట్రాన్సాక్షన్ విలువ సైతం పెరిగింది. ప్రస్తుతం సగటు రూపే కార్డ్ ట్రాన్సాక్షన్ విలువ రూ.3,400 ఉంది. మాస్టర్ కార్డ్ సగటు రూ. 4,300గా ఉంది. దేశంలో పాయింట్ ఆఫ్ సేల్(POS) టెర్మినల్స్ ద్వారా క్రెడిట్ కార్డులను అంగీకరించే వ్యాపారులు సుమారు 10 మిలియన్లున్నారు. కానీ యూపీఐ ద్వారా చెల్లింపులను అంగీకరించేవారు 50 మిలియన్లపైనే ఉన్నారు. మరోవైపు రూ. 2వేలలోపు లావాదేవీలకు ఎండీఆర్ చార్జీలు ఉండకపోవడం చిన్న రిటైలర్ వ్యాపారులు క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను అంగీకరించడానికి కారణంగా నిలుస్తోంది. ఇది రూపే క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడానికి సహాయపడుతోందని భావిస్తున్నారు.
