అక్షరటుడే, ఆర్మూర్: Armoor | కట్టుకున్న భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు(Armoor Police) తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ముద్దంగుల గంగారెడ్డి, అంజలి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రెండువారాల క్రితం ఈ కుటుంబం పట్టణంలోని పెద్దబజార్లో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. భర్త గంగారెడ్డి ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అయితే భర్త అక్రమ సంబంధం విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్నిరోజుల క్రితం గంగారెడ్డి విడాకుల కోసం బోధన్ కోర్టును ఆశ్రయించాడు.
సోమవారం భార్యాపిల్లలను బోధన్ కోర్టుకు రావాలని గంగారెడ్డి చెప్పడంతో వారంతా కోర్టుకు వెళ్లి తిరిగి ఆర్మూర్‌కు వచ్చారు. వెనకే వచ్చిన భర్త గంగారెడ్డి మద్యం మత్తులో భార్యను కత్తితో గొంతు కోసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. తమ తండ్రికి ఫేస్బుక్లో వేరే మహిళతో పరిచయం ఏర్పడిందని.. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు చేస్తున్నాడని కూతుళ్లు రోదిస్తూ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya), ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి(ACP Venkateswar Reddy), ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్(SHO Satyanarayana Goud) పరిశీలించారు. భర్త గంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.