అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది. 47 మంది ఎంపీవోలకు (MPO) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫేక్ అటెండెన్స్ (Fake Attendance)తో పలువురు పంచాయతీ కార్యదర్శులు (Panchayat Secretaries) మోసాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది.
జీపీ కార్యదర్శులు నిత్యం సమయానికి జీపీ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాలి. అయితే పలువురు కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్‌తో మోసాలకు పాల్పడ్డారు. తమ ఫోన్లను జీపీ కార్మికులకు (GP Workers) ఇచ్చి తమ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు యాప్‌లో అప్లోడ్ చేయించారు. మరికొందరు ఖాళీ కుర్చీల ఫొటోలు పెట్టి అటెండెన్స్ వేయించారు. ఓ కార్యదర్శి అయితే ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఫొటో పెట్టడం గమనార్హం. మరికొందరు పాత ఫొటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. కార్యదర్శుల మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధికారులు 15 మందిని సస్పెండ్ చేశారు.
GP Secretaries | 553 మంది కార్యదర్శుల గుర్తింపు
ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్న 553 మంది పంచాయతీ కార్యదర్శులను అధికారులు గుర్తించారు. వీరు విధులకు రాకుండానే హాజరు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే 15 మందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఓ కార్యదర్శిని మొత్తంగా విధుల్లో నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన వారిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాకు చెందిన వారే 10 మంది ఉండడం గమనార్హం.
GP Secretaries | మిగతా వారికి నోటీసులు
మొత్తం 553 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన వారు కాకుండా మిగతా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే కార్యదర్శుల విధుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 47 మంది మండల పంచాయతీ అధికారులకు సైతం నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన ఆదేశించారు.