అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనం(Suryaprabha Vahanam)పై భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి వారిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనసేవ(Chandraprabha Vahanaseva) నిర్వహించనున్నారు. బంగారు పూత పూసిన సప్త అశ్వాలతో రూపొందించిన వాహనంపై స్వామివారిని అలంకరించారు. మలయప్పస్వామి సూర్యనారాయణ స్వామి అవతారంలో దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై సర్వభూషితాలంకరణలతో మలయప్పస్వామి బాలకృష్ణుడి అవతారంలో మాఢవీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఎనిమిది రోజుల పాటు 14 వాహనాలపై స్వామి వారు విహరించనున్నారు. కాగా ఉత్సవాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
Tirumala | స్వర్ణరథంపై..
స్వామివారు సోమవారం రాత్రి స్వర్ణరథంపై విహరించారు. అంతకు ముందు వేంకటేశ్వర స్వామికి గజవాహన సేవ నిర్వహించారు. వాహనం ముందు ఏనుగులు నడుస్తుండగా.. స్వామివారి సేవ కనుల పండువగా సాగింది. కాగా వాహన సేవల్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వామి వారి ముందు కళాకారులు వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.