అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | నిత్యం ఏసీబీ దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏసీబీకి చిక్కుతున్న అధికారులు.. అంటూ రోజు వార్తలు వస్తున్నా లంచాలకు అలవాటు పడ్డ పలువురు భయపడడం లేదు. పనులు చేయడానికి భారీ మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు కేసుల్లో నిందితులను తప్పించడానికి మాముళ్లు వసూలు చేస్తున్నారు. ఇలా లంచం తీసుకుంటూ సూర్యాపేట డీఎస్పీ, సీఐ ఏసీబీకి చిక్కారు.
ACB Raid | రూ.25 లక్షల లంచం డిమాండ్
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సూర్యాపేటలో ఓ స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్న వ్యక్తిపై గతంలో కేసు నమోదైంది. ఆ వ్యక్తిని రిమాండ్కు పంపించకుండా ఉండడానికి డీఎస్పీ, సీఐ కలిసి రూ.25 లక్షల లంచం అడిగారు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని సదరు వ్యక్తి బతిమిలాడడంతో రూ.16 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు లంచం ఇవ్వగా అధికారులు డీఎస్పీ, సీఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ACB Raid | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాల్లో లంచం ఒకటి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అధికారుల చేతులు తడపాల్సిందే. లేదంటే లంచగొండి అధికారులు పట్టిపీడిస్తారు. ఎంతొస్తే అంత అన్నట్లు డబ్బులు డిమాండ్చేస్తారు. ఇక ఏదైనా కేసుల్లో ఇరుకున్నా.. అక్రమాలకు సహకరించాలన్నా.. రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు. అక్రమార్కుల ఆట కట్టించాల్సిన అధికారులు వారి దగ్గరే లంచాలు తీసుకొని పని చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు లంచం అడిగితే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఇవ్వొద్దని, భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.