అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2025 బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. కాగా.. మరో వారం రోజుల్లో టీంను ప్రకటించే అవకాశముంది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ జపాన్ పర్యటన (Japan Tour) క్రికెట్ వర్గాల్లో నూతన చర్చలకు తావిచ్చింది.హెర్నియా సర్జరీ అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy) ప్రాక్టీస్ ప్రారంభించిన సూర్య.. పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించాడు. అయితే అతని జపాన్ పర్యటన తాజాగా హాట్ టాపిక్ అయింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లన్ తన సోషల్ మీడియాలో జపాన్ పర్యటన గురించి వెల్లడించారు. అయితే సూర్య అక్కడికి ఎందుకు వెళ్లాడన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఫిట్‌నెస్ సమస్యల కోసం వెళ్లాడా? లేకపోతే వ్యక్తిగత ప్రయాణమా? అన్నది ఇంకా స్పష్టత లేకుండా ఉంది.
Team India | ఇదెక్కడి ట్విస్ట్..
ఈ పరిస్థితుల్లో ఆసియా కప్ జట్టులో సూర్య(Suryakumar Yadav)కు స్థానం ఉండదా? అనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. గాయం నుంచి సరిగా కోలుకోకపోవడంతో పాటు, కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌లో సత్తా చాటిన శుభ్‌మన్ గిల్‌కు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు మూడు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలని వాదిస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జట్టు ఎంపికలో అతని ప్రభావం పెరిగిందని బీసీసీఐ (BCCI) వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గిల్‌కు టెస్ట్ టీమ్, సూర్యకు టీ20 టీమ్ బాధ్యతలు అప్పగించగా.. ఈ ఎంపిక గంభీర్ సూచనల మేరకే జరుగుతుందని సమాచారం.
అయితే టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌లో (Asia Cup) ఆడకుంటే అది జట్టుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. రోహిత్ తప్పుకున్న తర్వాత జట్టు బాధ్యతలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్ టీమిండియాకు మంచి విజయాలు అందించాడు. మరి ఇప్పుడు సూర్యకుమార్ ఆడకుంటే కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేస్తారా, లేకుంటే గిల్‌ని ఎంపిక చేస్తారా అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికుల మదిలో తిరుగుతున్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే, బీసీసీఐ అధికారిక జట్టు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.