HomeతెలంగాణACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

ACB Raid | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. భూమి సర్వే చేయడం కోసం లంచం అడిగిన సర్వేయర్​ను అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | భూమి సర్వే చేయడానికి లంచం డిమాండ్​ చేసిన సర్వేయర్​తో పాటు అతడి సహాయకుడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్​ (Tahsildar) కార్యాలయాల్లో అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరి డిమాండ్​ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే పనులు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా సిరిసిల్ల (Siricilla) మండల తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మాడిశెట్టి వేణుగోపాల్, అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Raid | సర్వే చేయడానికి..

సిరిసిల్ల మండల పరిధిలోని ఓ మహిళ తన భూమిని సర్వే చేయాలని సర్వేయర్​ (Surveyor) వేణుగోపాల్​ను కోరింది. సర్వే చేసి పంచనామా ప్రతిని అందించడానికి ఆయన రూ.30 వేల లంచం డిమాండ్​ చేశాడు. అందులో ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. సర్వేయర్​తో పాటు ఆయన ప్రైవేట్​ సహాయకుడు సూర వంశీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. వారిపై కేసు నమోదు చేశారు.

ACB Raid | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా ఆఫీసుల్లోని పలువురు అటెండర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరగడంతో పలువురు అధికారులు ప్రైవేట్​ ఏజెంట్లను నియమించుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు ఏదైనా పని కోసం వస్తే ముందు తమ ఏజెంట్లను కలవాలని సూచిస్తున్నారు. వారు చెప్పినంత ఇస్తేనే పనులు చేపడుతున్నారు.