అక్షరటుడే, వెబ్‌డెస్క్: Surajkund Swing Accident | ఆనందోత్సాహాల నడుమ సాగుతున్న సూరజ్‌కుండ్ హస్తకళల మేళాలో శనివారం సాయంత్రం ఊహించని విషాదం చోటుచేసుకుంది. సందర్శకులను ఉల్లాసపరుస్తున్న ‘సునామీ స్వింగ్’ Tsunami Swing అనే భారీ వినోద ఊయల ఒక్కసారిగా విరిగి కిందపడిపోవడంతో మేళా ప్రాంగణం హాహాకారాలతో మార్మోగింది. వినోదం కోసం వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకుని రక్తపు మడుగులో విలవిల్లాడారు.
Surajkund Swing Accident | ఇన్స్పెక్టర్ మృతి
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను రక్షించేందుకు ముందుకొచ్చారు. ఊయల ఒక్కసారిగా వంగిపోతుండగా దాని కింద చిక్కుకున్న వారిని పక్కకు లాగే క్రమంలో ఊయలకు సంబంధించిన భారీ ఇనుప భాగం నేరుగా వచ్చి ఆయన ముఖం, తలపై బలంగా తాకింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన జగదీష్ ప్రసాద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మరణం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
13 మంది తీవ్రంగా గాయాలు..
సుమారు సాయంత్రం 6:15 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఊయల కూలిపోవడంతో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి తల, చేతులు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డిప్యూటీ కమిషనర్ Deputy Commissioner ఆయుష్ సిన్హా పరిస్థితిని సమీక్షించి వెంటనే అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసిన అధికారులు, ఊయల నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భారీ ఈదురుగాలులు..
ప్రమాదానికి ముందు మేళా ప్రాంగణంలో భారీ ఈదురుగాలులు వీచినట్లు సమాచారం. గాలి ధాటికి ఫుడ్ కోర్ట్ Food Court వద్ద ఉన్న ఒక గేటు కూడా కూలిపోయినట్లు తెలుస్తోంది. వాతావరణ ప్రభావం లేదా ఊయల యంత్రాంగంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకులను దూరంగా ఉంచుతున్నారు.