అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pegasus Spyware | దేశ భద్రత కోసం స్పైవేర్(Spyware) ఉపయోగిస్తే తప్పేమిటని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జాతీయ భద్రత కోసం దీన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది.
నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇజ్రాయిల్(Israel) చెందిన పెగాసస్ స్పైవేర్(Pegasus Spyware)ను ఉపయోగించి దేశవ్యాప్తంగా 50 వేల మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారంటూ 2021లో 17 వార్తా సంస్థల కన్సార్టియం ఓ కథనం ప్రచురించింది. ఇండియాలో టార్గెట్ చేసిన వారిలో రాహుల్ గాంధీ(Rahul gandhi), మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా(Ashok lavasa), టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ(Abhishek banerjee), అనేక మంది పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులు ఉన్నట్టు తెలిపింది.
ఈ వ్యవహారంతో అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం మరోసారి విచారించిన సుప్రీంకోర్టు (Supreme court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రత(National security) కోసం స్పైవేర్(Spyware) ఉపయోగించడంలో తప్పులేదని స్పష్టం చేసింది. అదే సాధారణ పౌరుల విషయంలో వినియోగిస్తున్నట్లు తేలితే దానిపై విచారణ జరుపుతామని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.
Pegasus Spyware | తప్పేం లేదన్న సుప్రీంకోర్టు..
దేశ భద్రత(National security) కోసం గూఢాచార్యాన్ని (Intelligence) ఎంచుకోవడంలో తప్పేమీ లేదని సుప్రీం స్పష్టం చేసింది. ”ఒక దేశం స్పైవేర్ వినియోగిస్తే అందులో తప్పేముంది? ఎవరి మీద స్పైవేర్ ఉపయోగించారనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడకూడదు. పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై వినియోగిస్తే తప్పులేదు. సామాన్య పౌరులపై ఉపయోగిస్తే దానిపై మేము దర్యాప్తు జరిపిస్తాం. సామాన్య ప్రజల గోప్యతకు రక్షణ కల్పిస్తాం” అని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్(Justice N. Kotishwar Singh) అన్నారు.
Pegasus Spyware | ఆ నివేదికను బహిర్గతం చేయలేం..
గూఢాచర్యం ఆరోపణలపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు (Supreme court) ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయలేమని, ఇది దేశ భద్రతకు, సార్వభౌమాధికారిని సంబంధించిన అంశమని న్యాయస్థానం పేర్కొంది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.పెగాసస్ స్పైవేర్‌ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది.