HomeUncategorizedBombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు...

Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల కేసులో 189 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) ఇటీవ‌ల సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే.

దీన్ని స‌వాల్ చేస్తూ మ‌హారాష్ట్ర ఏటీఎస్ సుప్రీంను ఆశ్ర‌యించ‌గా, విచార‌ణ చేప‌ట్టిన కోర్టు గురువారం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం(State Government) దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులోని నిందితులందరికీ నోటీసు జారీ చేసింది. అయితే, ఈ స్టే ఆర్డర్ నిందితుల జైలు విడుదలను ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.

Bombay Trains Blast Case | నిర్దోషులుగా ప్ర‌క‌టించిన హైకోర్టు..

2006లో ముంబై సబర్బన్ రైళ్లను(Mumbai Suburban Trains) లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస పేలుళ్లలో 189 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. జులై 11, 2006న ముంబై లోకల్ రైళ్లలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. 19 ఏళ్ల క్రితం ముంబై వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్‌ను గడగడలాడించిన ఈ దాడి అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఉదంతంపై విచార‌ణ చేప‌ట్టిన ప్రత్యేక కోర్టు 2015లో తీర్పు వెలువ‌రించింది. 12 మందిని దోషులుగా తేల్చి, ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ప్ర‌త్యేక కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ నిందితులు బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. సుదీర్ఘంగా విచారించిన న్యాయ‌స్థానం.. ఇటీవ‌ల సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారి శిక్షలను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలు నిందితులను దోషులుగా నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తేల్చింది. అందువల్ల, వారి శిక్షను రద్దు చేస్తూ, వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. వారు ఇతర కేసులో నిందితులుగా లేకపోతే, వెంటనే జైలు నుంచి విడుదల కావాలని కోర్టు ఆదేశించింది.

Bombay Trains Blast Case | సుప్రీంలో స‌వాలు..

బాంబే హైకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పును స‌వాల్ చేస్తూ మ‌హారాష్ట్ర ఉగ్ర‌వాద నిరోధ‌క ద‌ళం (Maharashtra Anti Terrorism Squad) మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ పిటిష‌న్‌ను అత్య‌వస‌రంగా విచారించాల‌ని విన్న‌వించ‌గా, న్యాయ‌స్థానం గురువారం విచారణ చేప‌ట్టింది. బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నిందితుల‌కు నోటీసులు జారీ చేసింది.