అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే, కొన్ని కీలక నిబంధనలపై మాత్రం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశముంటుందన్న నిబంధనపై స్టే విధించింది.
ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు చేసే వరకూ ఇది అమల్లోకి రాదని స్పష్టం చేసింది. పురాతన వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల వక్ఫ్ సవరణ చట్టం -2025ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రతినిధులతో పాటు పలు సంఘాలు సుప్రీంను ఆశ్రయించాయి. తాజా సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి(Chief Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court | కొన్నింటిపై మాత్రమే..
వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Act)పై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు.అయితే, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిబంధనను నిలిపివేయడాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ అంశం మునుపటి చట్టాలలో కూడా ఉందని పేర్కొంది. “1995 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ ఉందని మేము భావిస్తున్నాము.. ఇప్పుడు కూడా అది అమలులోనే ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ కొత్తది కాదని మేము నిర్ధారించాము” అని CJI అన్నారు. అదే సమయంలో కొన్ని కీలక నిబంధనలపై మాత్రం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవేమిటంటే..
కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించే అవకాశముందన్న ప్రొవిజన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని ఆచరించేవాడో లేదో నిర్ణయించడానికి నియమాలు రూపొందించే వరకు ఈ నిబంధన నిలిపివేయబడుతుందని పేర్కొంది. అటువంటి నియమం లేకుండా ఈ నిబంధన విధించడం అధికార దుర్వినియోగానికి దారి తీస్తుందని కోర్టు పేర్కొంది.
వక్ఫ్‌గా ప్రకటించబడిన ఆస్తి ప్రభుత్వ ఆస్తినా కాదా అని నిర్ణయించడానికి కలెక్టర్(Collector)కు అధికారం ఇచ్చే వక్ఫ్ చట్టంలోని మరొక నిబంధనపైనా ధర్మాసనం స్టే విధించింది. పౌరుల వ్యక్తిగత హక్కులపై తీర్పు చెప్పడానికి కలెక్టర్‌కు అనుమతి లేదని, ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది.
వక్ఫ్ బోర్డులో ముగ్గురు కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు ఉండకూడదనే నిబంధనను పక్కన పెట్టింది. ప్రస్తుతానికి మొత్తం నలుగురు ముస్లిమేతర సభ్యులను వక్ఫ్ కౌన్సిల్‌లలో చేర్చకూడదనే నిబంధనను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.