అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల బెడదతో విదేశాల్లో భారత్‌ను చెడుగా చిత్రీకరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
దేశంలో వీధికుక్కల (Street Dogs) బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు పెడితే మారుమూల గ్రామాల్లోని గల్లీల వరకు కుక్కల బెడద ఉంది. వీటి దాడిలో నిత్యం ఎంతో మంది గాయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. అయితే కుక్కల బెడద నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. ఇందులో భాగంగా సోమవారం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court | అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో..
వీధి కుక్కల బెడద నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) మండిపడింది. కుక్కులను పట్టుకోవడం, సంతానోత్పత్తిని నిరోధించడం, వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. అయితే రెండు నెలలు గడుస్తున్నా.. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలు అఫిడవిట్ ఇవ్వలేదు. దీంతో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Supreme Court | వ్యక్తిగతంగా హాజరు కావాలి
కుక్కల దాడులు (Dog Attacks) పెరుగుతున్నాయని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలతో విదేశాల్లో భారత్‌ను చెడుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. అధికారుల తమ తీరుతో దేశ పరువు తీస్తున్నారని మండి పడింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
వీధికుక్కలను పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయాలని కోర్టు ఆగస్టు 11న ఆదేశించింది. అనంతరం ఆ కుక్కలను ఎక్కడి నుంచి పట్టుకెళ్లారో అక్కడే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పినా.. రాష్ట్రాలు స్పందించలేదు. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు నవంబర్ 3న అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
1 comment
[…] చేసింది. ఆ అధికారం సుప్రీంకోర్టు (Supreme Court)కు లేదని సీజేఐ పేర్కొన్నారు. అలా […]
Comments are closed.