అక్షరటుడే, వెబ్‌డెస్క్:Supreme Court | పోక్సో కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారం అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుడ్ని దోషిగా తేల్చిన అత్యున్న న్యాయస్థానం.. అతడికి ఎలాంటి శిక్ష విధించలేదు.
ప్రత్యేక పరిస్థితుల్లో నిందితుడికి శిక్ష విధించడం లేదని కోర్టు తెలిపింది. బాధితురాలు ఇప్పుడు మేజర్ అయినందున ఈ ఘటనను నేరంగా చూడలేదన్న కోర్టు.. ఆ సంఘటన కంటే చట్టపరమైన, సామాజిక పరిణామాల నుంచి ఆమె మనస్సు ఎక్కువగా గాయపడినట్లు గుర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు(POCSO Case) నమోదైంది. సదరు నిందితుడికి ట్రయల్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అతడు కోల్‌కతా హైకోర్టు(Kolkata High Court)ను ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టాపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ 2023 అక్టోబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలి పోతారని, కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛను నియంత్రించుకోవాలని కోల్‌కతా హైకోర్టు సూచించింది.
Supreme Court | సుమోటోగా స్వీకరించిన సుప్రీం..
కోల్‌కతా కోర్టు వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటో(Sumoto)గా విచారణకు స్వీకరించింది. అదే సమయంలో నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించడంపై బెంగాల్ ప్రభుత్వం(Bengal Government) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కింది కోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం కోట్టివేస్తూ నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరించింది.
అయితే, బాధితురాలు అతడ్ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. బెంగాల్ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసి విచారణ జరపాలని సూచించింది. ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో బాధితురాలిని విచారించిన నిపుణుల కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలితో మాట్లాడిన ధర్మాసనం.. ఆమె టెన్త్ పరీక్షలు రాసిన తర్వాత ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
Supreme Court | తాజాగా తీర్పు వెల్లడి..
సదరు పోక్సో కేసు(POCSO Case)లో సుప్రీం ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. బాధితురాలు ప్రస్తుతం మేజర్, చట్ట ప్రకారం ఆ ఘటనను నేరంగానే చూస్తున్నప్పటికీ, ఆమె దానిని అలా చూడడం లేదని కోర్టు తెలిపింది. ఆ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ, కొన్ని ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొందని తెలిపింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దోషి, ప్రస్తుత కుటుంబ జీవితంలో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుని, బాధితురాలికి న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. పోక్సో కేసులో దోషిగా నిర్దారించినప్పటికీ, ఎలాంటి శిక్ష వేయకుండా తీర్పు వెలువరించింది.