అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ కారణాల వల్ల యువకులు ఆత్మహత్యలకు పాల్పడడం వ్యవస్థాగత వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ అంశాన్ని విస్మరించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.
2022లో జరిగిన ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించిన లెక్కలను ప్రస్తావిస్తూ న్యాయస్థానం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు చోటు చేసుకోగా, అందులో దాదాపు 13,044, విద్యార్థుల (7.6 శాతం) ఆత్మహత్యలు ఉన్నాయి. ఇందులో పరీక్షలలో ఫెయిల్ అయ్యామని 2,248 మంది ఆత్మహత్య చేసుకున్నారని ధర్మాసనం గుర్తు చేసింది.
Supreme Court | మార్గదర్శకాలు జారీ..
“భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు” శీర్షికన 2022లో ప్రచురించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలను ఉటంకిస్తూ అత్యున్నత న్యాయస్థానం.. ఇది తీవ్ర బాధాకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తోందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆత్మహత్యలపై ఆవేదనకు గురైన ధర్మాసనం.. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను జారీ చేసింది.
మెంటర్లు లేదా కౌన్సెలర్ల నియామకం, బోధన, బోధనేతర సిబ్బందికి తప్పనిసరి శిక్షణ వంటివి ఇందులో ఉన్నాయి. “అంకితమైన మెంటర్లు లేదా కౌన్సెలర్లను చిన్న బ్యాచ్‌ల వారీగా విద్యార్థులకు కేటాయించాలి, ముఖ్యంగా పరీక్షా సమయాలు, విద్యా పరివర్తనల సమయంలో గోప్యంగా మద్దతును అందించాలని” జస్టిస్ విక్రమ్ నాథ్ (Justices Vikram Nath), సందీప్ మెహతాతో (Justices Sandeep Mehta) కూడిన ధర్మాసనం సూచించింది.
Supreme Court | సంస్థాగత వైఫల్యమే..
ఆత్మహత్యలు పెరిగి పోతుండడం సంస్థాగత వైఫల్యమేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. “గమనించని మానసిక ఒత్తిడి, విద్యాపరమైన భారం, సామాజిక వైరుధ్యాలు, సంస్థాగత సున్నితత్వంలో పాతుకుపోయిన కారణాల వల్ల తరచూ యువకుల ప్రాణనష్టం జరుగుతుండడం విస్మరించలేని వ్యవస్థాగత వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుంది” అని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court | హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి..
గత రెండు దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగాయని ధర్మాసనం ఎత్తి చూపింది. 2001లో విద్యార్థుల ఆత్మహత్యలు 5,425 ఉండగా, 2022లో 13,044కు పెరిగాయని NCRB డేటా ప్రతిబింబిస్తుందని తెలిపింది. అన్ని విద్యా సంస్థలు (educational institutions) మానసిక ఆరోగ్య సేవలు, స్థానిక ఆస్పత్రులు, ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు తక్షణ రిఫెరల్ కోసం రాతపూర్వక ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది.
“విద్యాసంస్థల్లో, ముఖ్యంగా పాఠశాలలు, కోచింగ్ సంస్థలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలలో పెరుగుతున్న ఆత్మహత్యల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థులను పీడిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభం తీవ్రతను గుర్తించి, పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉంది” అని ధర్మాసనం తెలిపింది. “టెలి-మానాస్, ఇతర జాతీయ సేవలతో సహా ఆత్మహత్య హెల్ప్‌లైన్ నంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, సాధారణ ప్రాంతాలు, వెబ్‌సైట్‌లలో పెద్దగా, స్పష్టమైన ముద్రించాలి” అని సూచించింది.