Homeతాజావార్తలుSupreme Court | తెలంగాణ స్పీకర్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు

Supreme Court | తెలంగాణ స్పీకర్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ను ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​పై (Gaddam Prasad Kumar) సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన గడువులోగా అనర్హత పిటిషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా.. మమ్మల్ని తీసుకోమంటారా’’ అని ప్రశ్నించింది.

బీఆర్​ఎస్​ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లోపు చర్యలు చేపట్టాలని జులై 31న తీర్పు చెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. అయినప్పటికీ స్పీకర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్​ఎస్​ పార్టీ స్పీకర్​పై కోర్టు ధిక్కార పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court | స్పీకర్​కు నోటీసులు

బీఆర్​ఎస్​ పిటిషన్​ మేరకు తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పీకర్​ను ఆదేశించింది. మూడు నెల్లలోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి (Justice BR Gavai) అన్నారు. రోజువారీగా విచారణ జరిపి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. స్పీకర్​ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వాదించారు. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని వారు కోర్టుకు తెలిపారు.

కాగా.. స్పీకర్​ గత నెలలో నలుగురు ఎమ్మెల్యేలను విచారించారు. ఈ నెలలో మరో నలుగురిని విచారించారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు రానున్నాయి. అయితే అందరు ఎమ్మెల్యేలు కూడా తాము బీఆర్​ఎస్​లోనే ఉన్నట్లు స్పీకర్​ విచారణ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్​ టికెట్​పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్​కు (Danam Nagender) చిక్కులు తప్పే అవకాశం లేదు. అలాగే కడియం శ్రీహరి తన కూతురిని కాంగ్రెస్​ టికెట్​పై ఎంపీగా గెలిపించుకున్నారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేశారు. అలాగే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి (Pocharam Srinivas Reddy) పార్టీ మారిన అనంతరం ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. మిగతా వారు సాంకేతిక కారణాలతో తప్పించుకునే అవకాశం ఉన్నా.. వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Must Read
Related News