అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kamareddy | కామారెడ్డి జిల్లాలో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కామారెడ్డి పట్టణంలో పాటు పలు గ్రామాలను వరద ముంచెత్తింది.
భారీ వరద(Heavy Floods)లతో ప్రజలు అందరు ఇళ్లలోనే ఉండిపోయారు. అధికారులు మాత్రం వర్షంలో సైతం ప్రజలకు అండగా నిలిచారు. ముఖ్యంగా పోలీసులు ఇళ్లను వదిలి వరద ముంపు ప్రాంతాల్లో సేవలు అందించారు. ఓ వైపు వర్షాలతో తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళన చెందుతూనే.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు.
Kamareddy | ప్రాణాలను లెక్క చేయకుండా..
జిల్లాలో చాలా మంది పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. నిజాంసాగర్ మండలం అన్నాసాగర్‌లో వాగులో చిక్కుకున్న 9 మందిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. కామారెడ్డిలో వరదలో చిక్కుకున్న 500 మందిని పోలీసులు, సహాయక బృందాలు కాపాడాయి. గాంధారి ఎస్సై(Gandhari SI), సిబ్బందితో కలిసి వరదల్లో చిక్కుకున్న ఇద్దరిని కాపాడారు. కామారెడ్డి పట్టణంలో సీఐ నరహరి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటుకు తీసుకువచ్చారు. ఇలా పోలీసులు వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించారు. దీంతో కామారెడ్డి(Kamareddy)కి చెందిన ఓ కవి పోలీసుల సేవలను కొనియాడుతూ కవిత రాశారు.
హ్యాట్సాఫ్ పోలీసన్న
హ్యాట్సాఫ్ పోలీసన్న
ఎక్కడేం జరిగినా డేగలా వాలతావు
మంచి చెడులను తెలుసుకుంటావు
ఖాకీ దుస్తులు వేసుకున్నావంటే విధుల్లో నిమగ్నమవుతావు
ఆకలి దప్పులు ఎరుగవు
వాగులు పొంగినా.. వరదలు ముంచెత్తినా..
పౌరులను భుజాన మోసుకొని ఒడ్డుకు చేరుస్తావు
పై అధికారులు చివాట్లు పెట్టినా..
ఖద్దరు బట్టలోళ్లు కన్నెర్ర జేసినా కిమ్మనవు
ఎన్ని బాధలున్న కడుపులో దాచుకుంటావు
వృత్తి ధర్మాన్ని చాటుతావు
రాత్రనక పగలనక ఎండా వాన చలిని లెక్కచేయకుండా పరుగెడుతావు
పండుగ లేదు పబ్బం లేదు..
వృత్తినే దైవంగా భావించే నీకు చేస్తాం సలాం…
– డి శ్రీరామ్, కామారెడ్డి