అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు.
ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.
Revanth meet Nirmala : ల్యాబ్‌ల కోసం రూ. 9 వేల కోట్లు
అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని వివరించారు.
రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.
ఈ నిధుల సమీకరణ నిమిత్తం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కోరారు.
గత ప్రభుత్వంలో అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చారని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.