అక్షరటుడే, కామారెడ్డి: Urea | యూరియా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. తక్షణమే సరఫరా చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి (District Agriculture Officer) మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా (Urea) కొరత ఉండడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. యూరియా సరఫరాపై అధికారిని అడిగితే అక్కడా ఇక్కడా ఉందని చెబుతున్నారని.. ఆ ప్రాంత రైతులకు ఫోన్ చేస్తే యూరియా లేదని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పంటలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో యూరియా లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
Urea | మండలాలకు వచ్చిన యూరియా సరిపోదు..
మండలానికి 60, 70 టన్నులు యూరియా వచ్చిందని చెబున్నారని, ఆ యూరియా ఎవరికి సరిపోదని భారతీయ కిసాన్‌సంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మాఫియాగా తయారవుతున్నారని, యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలకు విక్రయిస్తూ అవసరం లేకున్నా ఇతర మందులు అంటగడుతున్నారని తెలిపారు.
తక్షణమే వ్యాపారుల షాపులపై రైడ్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో రైతులకు యూరియా సరఫరా చేయకపోతే మండలాల వారీగా ధర్నాలు చేపట్టి జిల్లాను దిగ్బంధిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కార్యదర్శి శంకర్ రావు జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, రమణారెడ్డి, గోపాల్ రెడ్డి, అంజన్న, భైరవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
